AP El Nino 2026: ఏపీకి ఎల్ నినో ముప్పు తీవ్రమే ? నిపుణుల తాజా వార్నింగ్..!
ఈ ఏడాది ఎల్ నినో (El Nino) ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సరైన వర్షపాతం కురవడం కష్టమేనని భారత వాతావరణ విభాగం (IMD) ఇప్పటికే హెచ్చరికలు చేసింది. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇందుకు మినహాయింపుగా ఐఎండీ పేర్కొంది. కానీ వాతావరణ నిపుణులు మాత్రం ఆ విషయం ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని, వాస్తవానికి ఏపీలో చాలా ప్రాంతాలు ఎల్ నినో నుంచి మినహాయింపేమీ కాదని తేల్చేస్తున్నారు.
రుతుపవనాల సమయంలో ఏపీలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్‌డి నివేదిక తెలిపింది. రుతుపవనాల సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భాగంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మధ్య , ఉత్తర భాగంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం నుండి అధిక వర్షపాతం కురిసేందుకు 34-45% అవకాశం ఉందని తెలిపింది. కానీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే స్వల్ప అవకాశం మాత్రమే ఉందని, ఈ అంచనా 4 నెలలకు సంబంధించినది కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ఐఎండి అమరావతి సీనియర్ శాస్త్రవేత్త కరుణాసాగర్ వెల్లడించారు.

జూన్‌లో బలహీనమైన ఎల్ నినో పరిస్థితులు, జూలై-ఆగస్టులో బలహీనం నుంచి మోస్తరు పరిస్థితులు, ఆగస్టు-సెప్టెంబర్‌లో మోస్తరు నుంచి బలమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఏపీలో అత్యధిక వర్షపాతం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురుస్తుంది. జూన్ నెలకు సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాత అంచనాలను కూడా ఐఎండి వెల్లడించింది. వచ్చే నెలలో రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే స్వల్ప అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా, జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, వడగాలుల రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని ఐఎండి తన నివేదికలో తెలిపింది.

అయితే మే నెలలో ఉన్నంత తీవ్రంగా వేడి ఉండదని ఐఎండి అమరావతి డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయన్నారు. అయితే, వర్షాలు లేనప్పుడు, ఆకాశం నిర్మలంగా లేనప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. జూన్‌లో మూడు, నాలుగు రోజుల పాటు వడగాలులు వీయవచ్చన్నారు. అప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గి, చివరికి వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలలో సాధారణం కంటే 3-4 డిగ్రీల సెల్సియస్ వరకు వ్యత్యాసం ఉండవచ్చని అంచనా వేశారు. సరైన నీటి నిర్వహణ, పంట ప్రణాళిక చాలా ముఖ్యమని ఆమె సూచించారు.














Click it and Unblock the Notifications