కుమ్ముతున్న భారీ వర్షాలు- ఏపీలోని ఆ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం
Heavy rains: ఏపీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రపై వర్షాల తీవ్రత అధికంగా ఉండనుంది. ఉత్తరాంధ్ర, ఆ రీజియన్ పరిధిలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని సూచించారు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కోనసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని నగరంలో 46 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
మలికిపురం- 36.2, ప్రకాశం జిల్లా నర్సింగోలు- 27, కాకినాడ జిల్లా డీ పోలవరంలో 25.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ రీజియన్ లోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరుల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications