ఇక వారికీ ఇందిరమ్మ ఇళ్లు, పంపిణీ ముహూర్తం- ప్రభుత్వం ప్రకటన..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ పలు కొత్త పథకాలు.. నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. జూన్ 2న కొత్త పెన్షన్లు.. రేషన్ కార్డులతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు నిర్ణయించింది. ఇప్పటికే పథకం అమలును ప్రతిష్ఠాత్మకం గా భావిస్తున్న ప్రభుత్వం..క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల నుంచి వస్తున్న అభ్యర్ధనల మేరకు జిల్లా స్థాయి అధికారులకు సూచనలు చేస్తోంది. కాగా.. ఇక ఇప్పుడు ఇందిరమ్మ పథకం హైదరాబాద్ లో అమలు పైనా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది.
పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పైన మంత్రి పొంగులేటి కీలక అంశాలను వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. శనివారం (మే 30) బంజారాహిల్స్‌లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలోనే గ్రేటర్ పరిధిలో తొలివిడతగా మంజూరు చేసిన లక్ష ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఏడాది తిరిగేలోగా ఈ లక్ష ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని, ఆ తర్వాత మలి విడతగా మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

గ్రేటర్ పరిధిలో పంపిణీ
గత ప్రభుత్వంలాగా పేదలకు ఒకచోట ఇళ్లు ఇచ్చి, వారిని 30-40 కిలోమీటర్ల అవతలకు పంపించే ఆలోచన తమకు లేదని మంత్రి విమర్శించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఏ నియోజకవర్గ ప్రజలకు ఆ ప్రాంతంలోనే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇది పేదలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే కానుకని కొనియాడారు. పేదవాని గుమ్మం వద్దకే ప్రజా ప్రభుత్వ పథకాలు చేరేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా మరో కీలక అంశాన్ని మంత్రి వెల్లడించారు. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే తదితర శాఖలన్నీ ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ సమీకృత భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటు రంగానికి ధీటుగా, కార్పొరేట్ తరహాలో మారుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై నిధుల భారం పడకుండా ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ 'ఫినిక్స్'కు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించా మని.. త్వరలోనే 30 వేల చదరపు అడుగుల్లో ఈ భవనం పూర్తవుతుందని వెల్లడించారు.













Click it and Unblock the Notifications