చెప్పుకోవడానికి విశ్వ గురు- ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేడు: రాహుల్ పంచ్
నీట్ ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణల కారణంగా జాతీయ పరీక్షల సంస్థ (NTA)పై ప్రజల్లో ఉన్న ఆగ్రహం చల్లారకముందే ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) పరీక్ష కేంద్రాల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. అనేకచోట్ల ఉదయం పూట జరగాల్సిన పరీక్షలు సకాలంలో మొదలు కాలేదు. ఈ జాప్యం మధ్యాహ్నం షిఫ్ట్ పరీక్షలపైనా ప్రభావం చూపింది.
సీయూఈటీ పరీక్షలు దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో నిర్వహించారు గానీ అనేక కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా పరీక్షలు నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు. ఈ అకస్మాత్తుగా ఏర్పడిన సాంకేతిక లోపాలు విద్యార్థులు, పరీక్షా నిర్వహణకు భారీ అసౌకర్యాన్ని కలిగించాయి. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్షను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ అనివార్యమైన జాప్యానికి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేసింది.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. విశ్వగురు అని చెప్పుకొనే మోదీ ప్రభుత్వం ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేకపోతోందని ఆరోపించారు. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ పరీక్ష కొన్ని కేంద్రాల్లో సాంకేతిక లోపంతో ఆలస్యం కావడంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నీట్, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ, నేడు సీయూఈటీ. ఈ నాలుగు పరీక్షలకు దాదాపు కోటి మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందని, వీటిల్లో ఏ ఒక్క దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో నిర్వహించలేదని రాహుల్ గాంధీ అన్నారు. విశ్వగురు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం దేశంలో ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ధ్వజమెత్తారు.
NEET। CBSE। SSC। और आज CUET।
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2026
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
ఎవరి భవిష్యత్తును నాశనం చేస్తున్నారో, అదే తరం కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. సీబీఎస్‌ఈ గందరగోళంపై మోదీ మౌనం వహించడం, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం వంటి పరిణామాల గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ మనుగడపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారని, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుపై కాదని అన్నారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో గతంలో జరిపిన సంభాషణ వీడియోను సైతం షేర్ చేశారు.












Click it and Unblock the Notifications