చంద్రుడిపై ఫాల్కన్ సృష్టించిన విధ్వంసం: ఎన్నో రహస్యాలు వెలుగులోకి
చంద్రుడి ఉపరితలంపై మానవ నిర్మిత వ్యర్థాలు సృష్టిస్తున్న మార్పులపై సరికొత్త ఆధారాలు లభించాయి. చంద్రుడి ఉపరితలంపై ఇటీవల కొత్తగా ఏర్పడిన ఓ భారీ గొయ్యిని అత్యంత స్పష్టమైన చిత్రాలతో ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన హెచ్ డీ ఇమేజీలను విడుదల చేసింది. స్పేస్‌ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ అప్పర్ స్టేజ్ శకలం అత్యంత బలంగా డీకొట్టడం వల్ల ఈ క్రేటర్ ఏర్పడిందని నాసా తాజాగా నిర్ధారించింది.
గత ఏడాది జనవరి నెలలో ప్రయోగించిన ఫైర్‌ఫ్లై బ్లూ ఘోస్ట్ 1 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ అప్పర్ స్టేజ్.. అంతరిక్షంలో కొన్ని నెలల పాటు నియంత్రణ లేకుండా పరిభ్రమించింది. ఆ తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణకు లోనైంది. ఈ నెల 5వ తేదీన చంద్రుడి ఉపరితలాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. అది ఢీ కొట్టిన వేగం కారణంగా చంద్రుడి ఉపరితలంపై నూతనంగా ఓ భారీ గొయ్యి ఏర్పడింది.

ఈ అరుదైన దృశ్యాన్ని నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఓ శాటిలైట్ ఈ నెల 11, 12 తేదీల మధ్య విజయవంతంగా తన కెమెరాల్లో బంధించింది. నాసా రోవర్, ఆర్బిటర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ క్రేటర్ సుమారు 60 అడుగుల వెడల్పు కలిగి ఉంది. దీని లోతు సుమారు 10 అడుగుల వరకు ఉన్నట్లు నిర్ధారించారు. రాకెట్ శకలం బలంగా ఢీకొట్టిన వేగానికి అక్కడ ఒక ప్రత్యేకమైన భౌగోళిక ఆకృతి సైతం ఏర్పడింది. ఈ ఇంపాక్ట్ సంభవించిన ప్రదేశం చుట్టూ నలుపు, తెలుపు రంగుల రేఖలు విస్తరించి ఉండటాన్ని నాసా గుర్తించింది.
నల్లటి రంగులో మెరుస్తూ కనిపించిన కిరణాలను.. కొన్ని కోట్ల సంవత్సరాలుగా కాస్మిక్ కిరణాలు, సోలార్ విండ్స్ ప్రభావానికి గురైన చంద్రుడి పైపొరలోని దుమ్ము, మట్టిగా నిర్ధారించింది నాసా. తెల్లని కాంతితో మెరుస్తున్న రేఖలు.. ఢీకొట్టిన ప్రదేశంలో నేల లోపలి పొరల నుంచి పైకి ఎగసిపడిన తాజా రసాయన మూలకాలు అని నిరూపితమైంది. ఇది చంద్రుడి అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఓ గొప్ప అవకాశంగా మారిందని నాసా పేర్కొంది.
చంద్రుడికి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తులో సెకనుకు దాదాపు 1.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న శాటిలైట్ కెమెరాలను సరైన కోణంలోకి మరల్చడం ద్వారా ఈ ఫొటోలను తీయగలిగారు నాసా శాస్త్రవేత్తలు. ఈ ప్రక్రియలో ఓ 100 సెకన్ల టైమింగ్ తేడా వచ్చినా, ఈ లొకేషన్ కెమెరా ఫ్రేమ్ నుంచి పూర్తిగా తప్పిపోయేదని వెల్లడించారు. ఈ అద్భుతమైన షాట్ పడేవరకు ఆర్బిటర్ దాదాపు ఆరు రోజుల పాటు అనుకూలమైన పోజిషన్ కోసం వేచి చూడాల్సి రావడం విశేషం.
ఈ అరుదైన సమాచారాన్ని సేకరించడంలో అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల సమన్వయం కీలకపాత్ర పోషించింది. రాకెట్ చంద్రుడిపై పడే ఖచ్చితమైన స్థానాన్ని ముందుగానే అంచనా వేయడంలో దక్షిణ కొరియాకు చెందిన దనూరి అనే పాత్‌ఫైండర్ లూనార్ ఆర్బిటర్ స్పేస్ షిప్ సహాయపడింది. దనూరి పంపిన కోఆర్డినేట్స్ డేటాన్ని విశ్లేషించిన తర్వాతే నాసా ఆర్బిటర్ మరింత ఖచ్చితమైన మ్యాపింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగింది.
మానవ నిర్మిత వ్యర్థాలు చంద్రుడి సహజ రూపురేఖలను ప్రస్తుత కాలంలో ఎలా మార్చేస్తున్నాయో వివరించడానికి ఈ కొత్త క్రేటర్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవ యాత్రలకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో అక్కడి భూభాగంలో అంతరిక్ష శకలాల వల్ల వస్తున్న ఇలాంటి మార్పులకు సంబంధించిన పూర్తి స్థాయి డేటా మన భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు అత్యంత కీలకం కానుంది.














Click it and Unblock the Notifications