• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ టార్గెట్: తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో బాబు

By Pratap
|
Chandrababu Naidu - YS Jagan - K Chandrasekhar Rao
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ టార్గెట్ మారినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆయన టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తెరాస పట్ల ఇంత కాలం కాస్తా సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, ఉప ఎన్నకల్లో తెరాసపై తన పార్టీ అభ్యర్థులను కూడా పోటీకి దించని వైయస్ జగన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. తెరాసను ఢీకొట్టడానికి ఆ పార్టీ సిద్ధపడింది.

తెలంగాణ ప్రాంతంలో తెరాసను సాధ్యమైనంత బలహీనపరిచే ఉద్దేశంతో ఆయన వ్యూహరచన, కార్యాచరణ సాగుతున్నట్లు అర్థమవుతోంది. జైలులో ఉంటూనే తన తల్లి వైయస్ విజయమ్మ ద్వారా ఆ పనిని ఆయన చేపట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణవాదంతో కెసిఆర్ తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసుకుని బలహీనపరిచారు. దీంతో ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో బలహీనపరచాల్సిన అవసరం జగన్‌కు లేకుండా పోయింది. సీమాంధ్రలో దాదాపుగా తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్ విసిరి దాని మనుగడను ప్రశ్నార్థకం చేసినట్లు భావిస్తున్నారు.

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది కీలకమైన నేతలు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇక, తెలంగాణలో తెరాసను అదే రీతిలో బలహీనపరిస్తే రాష్ట్రవ్యాప్తంగా తనకు ఎదురు లేకుండా పోతుందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోయిందని, తామే తెరాసకు పోటీ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పటికే చెప్పుకుంటున్నారు. దీంతో తెరాసను బలహీనపరచడమే పనిగా ఆ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని అంటున్నారు.

ఇంతకు ముందు తెరాసలో ఉన్న కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. తాము బలపడుతూ, తెరాసను ఎదుర్కోగలమని, తమ బలం ద్వారా తెలంగాణవాదాన్ని అధిగమించగలమనే విశ్వాసం కల్పిస్తే మరింత మంది నాయకులు తమ పార్టీలోకి వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణలో కార్యక్రమాలను చేపట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో వైయస్ విజయమ్మ ధర్నా దానికి ప్రారంభంగా భావిస్తున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే కార్యక్రమాన్ని అమలు చేయడంతో తెరాస పట్ల ఇంత కాలం వైయస్సార్ కాంగ్రెసు సానుకూలంగా ఉన్నట్లు కనిపించిందని చెబుతున్నారు.

భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎలో భాగస్వామి కావడానికే వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో శరద్ పవార్‌లా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో తాను ఉండాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెరాసపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై దూకుడు పెంచడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడం వంటి పరిణామాలు ఆయన రాజకీయ దిశను తెలియజేస్తున్నాయని అంటున్నారు. తెరాసను బలహీనపరిస్తే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే 2014 ఎన్నికలను ఎదుర్కోవచ్చుననే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ముందుకు రావచ్చునని అంటున్నారు.

ఈ వ్యూహాన్ని ఊహించే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాపై, ధర్నాకు సహకరించారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించే తెరాస నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై యుద్దం ప్రకటించినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో మేం అనే కెసిఆర్ మాటలను వమ్ము చేసి ఇక్కడా అక్కడా మేమే అని నిరూపించుకోవడానికి వైయస్ జగన్ సిద్ధపడినట్లు చెబుతున్నారు.

English summary

 According to political analysts - YSR Congress party president YS Jagan has targeted Telangana Rastra Samithi (TRS) in Telangana region and Telugudesam president N Chandrababu Naidu in Seemandhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X