గాలి డీల్: ఎసిబితో సోమశేఖర రెడ్డి దాగుడు మూతలు

గాలి బెయిల్ కుంభకోణం కేసులో ఎసిబి అధికారులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోమశేఖర రెడ్డి మాత్రమే అరెస్టు కావాల్సి ఉంది. జులై మూడో వారంలో సోమశేఖర రెడ్డికి ఎసిబి నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎసిబి ముందుకు రావడానికి బదులు సోమశేఖర రెడ్డి, కంప్లి శాసనసభ్యుడు సురేష్ బాబు ఎసిబి కోర్టులో జులై 26వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఆ తర్వాత నాలుగు రోజులకు న్యాయవాదిని కలవడానికి హైదరాబాదు వచ్చిన సురేష్ బాబును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. సురేష్ బాబును అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందు సోమశేఖర రెడ్డి బళ్లారిలో ఓ సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిసినప్పటికీ మద్దతుదారులు తమను అడ్డుకోవచ్చునని, దాని వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చునని భావించి ఎసిబి అధికారులు సోమశేఖర రెడ్డి జోలికి వెళ్లలేదు. సోమశేఖర రెడ్డి ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ కనిపించి అకస్మాత్తుగా మాయమయ్యారు.
సురేష్ బాబు అరెస్టు తర్వాత తన ప్రతి కదలికను ఎసిబి కనిపెడుతోందని గుర్తించిన సోమశేఖర రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తన ఆచూకీ దొరకకుండా సెల్‌ఫోన్ వాడకాన్ని మానేశారని, గన్‌మన్‌ను వెనక్కి పంపించారని తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆయన అత్యవసరమైన పనుల కోసం ఎవరెవరి ఫోన్‌లో వాడుతూ ఎప్పటికప్పుడు స్థలాలు మారుతున్నట్లు తెలుస్తోంది. సోమశేఖర రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు గురువారం కొట్టేసింది. ఈ స్థితిలో ఆయన లొంగిపోయే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications