వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో గవర్నర్ బిజీ బిజీ: అసలేం జరుగుతోంది?

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలపై పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏం జరుగుతోందనే ఆసక్తి పెరుగుతోంది. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చానని, తన భేటీలకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని గవర్నర్ అన్నారు. అయితే, ఆయన అలా అన్నప్పటికీ ఏదో జరుగుతోందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందా, తెలంగాణపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.

గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. దానికి తోడు, పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తీవ్రమైన పరిణామాలే చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా, జైపాల్ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాదులోని పిసిసి కార్యాలయం గాంధీభవన్‌లో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండింది. కానీ, దానికి ఆయన హాజరు కాలేదు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులపై చెలరేగిన వివాదం కారణంగానే మనస్తాపానికి గురై జైపాల్ రెడ్డి రాలేదని చెబుతున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, దానివల్లనే ఆయన రాలేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జైపాల్ రెడ్డి రాకపోయినా కాంగ్రెసు నాయకులు కె. కేశవ రావు, వి. హనుమంతరావు వంటి నాయకులు కార్యక్రమాన్ని సాగించారు. మంత్రులు మాత్రం కార్యక్రమానికి ముఖం చాటేశారు.

జైపాల్ రెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి సమరం ప్రకటించడం వెనక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయని అంటున్నారు. నాయకత్వ మార్పు ఉప్పు ఏదైనా అందడం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి జైపాల్ రెడ్డిని దానికి కేంద్రంగా భావించి సమరం ప్రారంభించి ఉంటారనే భావన కూడా కలుగుతోంది. జైపాల్ రెడ్డికి కాంగ్రెసు తెలంగాణ మంత్రులు పూర్తిగా మద్దతు పలుకుతూ, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతున్నారు.

కేంద్ర మంత్రులను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని గవర్నర్ చెప్పారు. జైపాల్ రెడ్డితో గ్యాస్ కేటాయింపుల వ్యవహారంపై చర్చ కూడా జరగలేదని ఆయన అన్నారు. అయితే, జైపాల్ రెడ్డికి ఆయన పూర్తిగా మద్దతు పలుకుతూ కిరణ్ కుమార్ రెడ్డిపై సెటైర్లు వేశారు. గ్యాసే లేకపోతే కేటాయింపులు ప్రసక్తి ఎలా ఉంటుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి డమ్మీ అనడంలో నిజం లేదని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఉప ముఖ్యమంత్రి, మంత్రుల బృందం చర్చలు చేస్తున్నట్లు, విద్యార్థులకు అన్యాయం జరగకుండా నిర్ణయం జరగనున్నట్లు ఆయన తెలిపారు.

గవర్నర్ భేటీ తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. తాను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశానని, ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న నరసింహన్ కలిసినప్పుడు ఇరువురి మధ్య సంభాషణ జరగడం సహజమని ఆయన అన్నారు. అన్ని విషయాలు గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మాట్లాడేందుకు గవర్నర్ నిరాకరించారు.

English summary
Governor Narasihan was busy today in Delhi meeting several union ministers like Sushil kumar Shinde, Jaiapal Reddy and Chidambaram. Speculation is that there may be leadership changes in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X