హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై సోమిరెడ్డి ఫైర్, కెసిఆర్‌పై మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy-Mothukupalli Narasimhulu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై అదే పార్టీ తెలంగాణ శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ నల్లధనం కేంద్ర ప్రభుత్వ లెక్కలోకి రాలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అవినీతి దారుల్లో వైయస్ జగన్‌కు దేశంలో మొదటి స్థానం లభిస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

దేశంలోని నల్లధనం 49 వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం తేల్చిందని, అయితే వైయస్ జగన్ ఒక్కడి నల్లధనమే 43 వేల కోట్ల రూపాయలని సిబిఐ తేల్చిందని ఆయన అన్నారు. దేశంలో నల్లధనం రోజురోజుకూ పేరుకుపోతోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేకపోయిందని ఆయన అన్నారు.

కెసిఆర్ అబద్ధాలకోరు అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాల కోసం కెసిఆర్ పెట్టే ట్రస్టు బోగస్ అని, దానికి ఎవరూ విరాళాలు ఇవ్వకూడదని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకూలమని, ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకి అని పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అనడం అర్థరహితమని ఆయన అన్నారు. తెలంగాణపై ఏ విధమైన సంకేతాలు లేవని యాష్కీకి తెలుసునని ఆయన అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా తాము ఇచ్చిన లేఖ ఇప్పటికే ప్రణబ్ ముఖర్జీ వద్ద ఉందని, అవసరమైతే మరో లేఖ ఇస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ మాటలు నమ్మవద్దని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. పోలవరం టెండర్ల కోసం కెసిఆర్ సకల జనుల సమ్మెను అడ్డు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద కెసిఆర్ కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వొద్దని కెసిఆరే కేంద్రానికి చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికీ రాని సంకేతాలు తెలంగాణపై కెసిఆర్‌కు ఎలా వస్తాయని ఆయన అడిగారు.

ఇస్కాన్ ఆలయంపై దాడి చేసిన మంత్రి దానం నాగేందర్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడాన్ని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య తప్పు పట్టారు. మంత్రులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని ఆయన అన్నారు. నాగేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన గవర్నర్ నరసింహన్‌ను కోరారు.

మంత్రులపైనే ఆరోపణలు వస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అడిగారు. దొంగలతో రాజ్యమేలుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అధికారం నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Telugudesam leader Somireddy Chandramohan Reddy fired at YSR Congress president YS Jagan. Meanwhile TDP Telangana region MLA Mothkupalli Narasimhulu made comments against Telangana Rastra samithi (TRS) president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X