• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్లమెంటులో అదే గొడవ: విపక్షాలపై చిదంబరం ఫైర్

By Pratap
|

Parliament stalled for fourth day over coal scam
న్యూ ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల విషయంలో ఎక్కడా చిన్న తప్పు కూడా జరగలేదని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్, న్యాయ శాఖ మంత్రి సాల్మన్ ఖుర్షీద్ సమర్థించుకున్నారు. ఇందులో ప్రధానమంత్రికి ఎటువంటి సంబంధం లేదని కూడా వారు వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా సమస్యను పెద్దదిగా చూపిస్తున్నాయని వారు ఆరోపించారు.

ముందు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు, ప్రధాని రాజీనామా చేయాలని గట్టిగా కోరుతున్నప్పుడు, ప్రధాని సభలో ఇచ్చే వివరణను వినడానికైనా ప్రతిపక్షం సిద్ధంగా ఉండాలి కదా అని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రధాని రాజీనామా చేసితీరాలంటూ ప్రతిపక్షాలు మరింత గట్టిగా పట్టుపడితే ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతున్నదన్న ప్రశ్నకు దీనికి ఒక్కటే సమాధానం - ఓపికగా ఉండడం అని ఆయన చెప్పారు. బిజెపికి కూడా ఇదే మా సమాధానం అని, ఇప్పటివరకూ తాము ఓపికగానే ఉన్నామని, ప్రజలు కూడా ఈ వారం రోజులుగా తమ ఓపికను చూస్తున్నారని ఆయన అన్నారు.

సోమవారం నాడు ప్రధాని తమ వైఖరి వివరించనున్నారు, దాన్ని వినడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలి, లేదంటే ప్రధాని జాతికి ఇవ్వదలచిన వివరణను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించడానికి యత్నిస్తామని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులూ ప్రభుత్వ వైఖరిని సమర్ధించుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి ముందు పార్లమెంటు సమావేశాలను సజావుగా నడవడానికి సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. చర్చకు ప్రభుత్వం వెనకాడడం లేదని, ప్రతిపక్షాలే చర్చకు భయపడుతున్నట్టు కనిపిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం అన్నారు.

భూమి నుంచి అసలు బొగ్గునే తీయకపోతే ఇక అందులో నష్టం జరగడానికి అవకాశం ఎక్కడ అని చిదంబరం ప్రశ్నించారు. గతంలో అమలు జరుగుతున్న లోపాలను సరిచేయడమే ప్రభుత్వం చేసిన తప్పా అని కూడా ఆయన నవ్వుతూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమీ చేయకపోతే అంతా బాగున్నట్టా అని ఆయన అన్నారు. ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల క్రమబద్ధీకరణ మాత్రమే చేస్తుందని, బొగ్గుతో వ్యాపారం చేయదని ఆయన వివరించారు. బొగ్గు గనుల నుంచి బొగ్గును తీయనప్పుడు ఇక నష్టం అనే మాటకు అర్థం లేదని ఆయన చెప్పారు. బొగ్గు తవ్వకాలకు లైసెన్స్ ఇవ్వడం వేరు, ఆ లైసెన్స్ విధానాన్ని క్రమబద్ధీకరించడం వేరు అని ఆయన వివరించారు.

కాగ్ నివేదిక, తదనంతర పరిణామాలపై పత్రికలలో చాలా వరకు సరిగానే కథనాలు, విశ్లేషణలు వస్తున్నాయని ప్రశంసిస్తూ, కొన్ని పత్రికలు మాత్రం సమస్యను సరిగా అవగాహన చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగ్ నివేదికపై తాము ప్రత్యేకంగా వ్యాఖ్యానాలు చేయడానికి ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించలేదని, కేవలం పార్లమెంటు సమావేశాలను జరగనివ్వండని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేయడం, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ మీడియా సమావేశం ఉద్దేశమని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వివరించారు.

పార్లమెంటు సమావేశాలు ప్రజలకోసం, అందువల్ల సమావేశాలను నిరోధించకుండా వాటిని కొనసాగించడానికి సహకరించాలని చిదంబరం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ముందు సభను జరగనివ్వండి, బొగ్గు కేటాయింపుల విధానంలో యు.పి.ఎ. ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు,ఏది ఏమైనా ఏ విషయంపైనైనా లోతుగా చర్చించడానికి సిద్ధం - ఇదే మేము చెప్పదలచిందని చిదంబరం వివరించారు. ఈ మీడియా సమావేశం జరుగుతున్నప్పుడు జైస్వాల్, ఖుర్షీద్ మధ్యమధ్యలో తమ వివరణను ఇచ్చారు.

బొగ్గు కుంభకోణంపై గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఈ ఉదయం ఉభయ సభలు ప్రారంభంకాగానే కోల్‌స్కాంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభాకార్యక్రమాలను స్తంభింపచేయడంతో ఇరు సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఉభయ సభల్లోనూ అదే పరిస్థితి నెలకొనడంతో లోకసభ సోమవారినికి వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది.

అంతకు ముందు - పార్లమెంటులో బొగ్గు కుంభకోణంపై దుమారం కొనసాగింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభంకాగానే బీజేపీ నేతలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. కోల్‌స్కాంపై చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ మీరాకుమార్ సభ్యులకు సర్దిచెప్పినప్పటికీ ఎలాంటి లేకపోవడంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ కోల్ స్కాంపై రగడ నెలకొనడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

English summary

 Parliament was disrupted for the fourth consecutive day today as opposition triggered uproar in both Houses demanding the resignation of Prime Minister Manmohan Singh over controversial coal block allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X