తెలంగాణ వివాదం: అద్వానీపై చంద్రబాబు ఫైర్

రాష్ట్ర విభజన అవసరం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలోనే ఉన్నందున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని అద్వానీ అప్పట్లో అన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై బిజెపి నేతృత్వంలోని ఎన్డియే తన ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా చర్చించిందా అని ఆయన అడిగారు. ఎప్పుడైనా చర్చకు పెట్టారా, ఈ రోజు మాట మార్చడమేమిటని ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
తెలంగాణ సమస్య పరిష్కారంపై కన్నా తెలంగాణను రాజకీయం చేయడం మీదనే దృష్టి పెడుతున్నారని ఆయన ఇతర రాజకీయ పార్టీలను విమర్శించారు. తాము తెలంగాణపై ఇచ్చిన లేఖ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని ఆయన చెప్పారు. తాము ఎప్పటికప్పుడు తెలంగాణపై మాట్లాడుతూనే ఉన్నామని, పార్టీ మహానాడులో కూడా చెప్పామని ఆయన అన్నారు.
తెలంగాణపై మరోసారి తప్పకుండా స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. బిసి డిక్లరేషన్‌ను ప్రకటించామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చర్చించి స్పష్టమైన వైఖరి ప్రకటించామని, ఇప్పుడు తెలంగాణపై కూడా పార్టీలో చర్చించి స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున ఏం చేయాలో అది చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని, చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నారని గత కొద్ది కాలంగా బిజెపి విమర్శిస్తూ వస్తోంది. చాలా కాలంగా బిజెపి విమర్శలపై ఆయన స్పందించలేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మూడు రోజుల దీక్ష చేపట్టడం, తెలంగాణకు అనుకూలంగా బిజెపి జాతీయ నాయకులంతా గొంతు విప్పడం వంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కలిశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువరించాలని వారు చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే, తాము చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశామని వారు చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా ప్రధానిని కలిశారు. రాష్టాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేయాలని వారు ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications