• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏకాభిప్రాయం లేదుగా: తెలంగాణపై నారాయణతో పిఎం

By Pratap
|

PM Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం లేదు కదా అని సిపిఐ నాయకులతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు.ఆగస్టు 25 నుంచి ఈనెల మూడో తేదీ వరకూ తెలంగాణలో పోరుబాట జరిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా, పార్టీ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేశ్, సెక్రటేరియెట్ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పి.వెంకటరెడ్డి తదితరులు గురువారం మధ్యాహ్నం ప్రధానిని పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో కలిశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు క్లైమాక్స్‌కు చేరాయని, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఆమోదించి, రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడేయాలని కోరారు. దీనికి ప్రధాని స్పందిస్తూ - ఏకాభిప్రాయం ఉండాలి కదా? అని తమను ప్రశ్నించారని నారాయణ చెప్పారు. దీంతో ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన బాధ్యత మీదేనని తాను ప్రధానికి చెప్పానన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య విభేదాలు ఉంటాయని, అయినా ఇతర అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగానే తెలంగాణ సమస్యను కూడా పరిష్కరించాలని, తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానంతటదే సమస్య పరిష్కారం అయిపోతుందని సలహా ఇచ్చామన్నారు. 2004, 2009ల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హామీని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది కాబట్టి దీనిని పరిష్కరించాల్సింది కూడా కాంగ్రెస్సేనని స్పష్టం చేశానని తెలిపారు. అయితే, పరిశీలిస్తానని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారని నారాయణ చెప్పారు.

ప్రధాని వైఖరిని బట్టి ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని, ఆమోదించదని తనకు అర్థమైందన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఎంతో ప్రశాంతంగా వీరు ఇక్కడ కూర్చోవడాన్ని చూస్తే అభినవ నీరోలుగా కనిపిస్తున్నారని విమర్శించారు. కేంద్రం సూత్రప్రాయంగా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించి, ఇప్పుడు మాట మార్చిందని, కాబట్టే తాము ప్రత్యక్ష పోరాటాలకు, ఉద్యమాలకు దిగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

కాగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా గురువారం ప్రధానిని కలిశారు. దేశ, రాష్ట్ర, పార్టీ ప్రయోజనాల రీత్యా సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగుతుందని ప్రకటించాలని కోరారు. దీంతో "తెలంగాణ గురించి మీరు చెబుతున్న విషయాలన్నీ నాకు తెలుసు. కాంగ్రెస్ అధ్యక్షురాలు విదేశాలకు వెళ్లారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు కూడా చెప్పండి'' అని ప్రధాని వారికి స్పష్టం చేశారు. ప్రాంతీయ వ్యత్యాసాలు ఏమైనా ఉంటే ప్యాకేజీల ద్వారా, ప్రత్యేక మండళ్ల ద్వారా పరిష్కరించవచ్చని ఎంపీలు ప్రధానికి తెలిపారు.

ఎంపీల తరఫున పరిస్థితిని వివరించిన కావూరి సాంబశివరావు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఉత్తమ మార్గమని శ్రీకృష్ణ కమిటీ విస్తృత అధ్యయనం తర్వాత పేర్కొందని వివరించారు. భావోద్వేగాలు తాత్కాలికమైనవని, సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణ ప్రజలు కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉద్యమాలతో విసిగి పోయారని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఒకసారి ప్రకటిస్తే, ఉన్న ఉద్వేగాలు కూడా తగ్గిపోతాయని తెలిపారు.

తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రమైనా పరకాల ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు కేవలం 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. అదే 2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 70 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని నిలబెడితే బీజేపీ మత భావోద్వేగాలను రెచ్చగొట్టి విజయం సాధించిందని, తెలంగాణ ఏర్పడితే బీజేపీ మైనారిటీలపై దాడులు చేసి అసోం మాదిరి వాతావరణం ఏర్పరుస్తుందని తెలిపారు. 2011 జూలైలో సర్వే జరిగినప్పుడు తెలంగాణలో 50 శాతం, రాయలసీమ, తెలంగాణల్లో 90 శాతం ప్రజలు సమైక్యాంధ్రకు మద్దతు పలికారని వివరించారు.

తెలుగువారి మధ్య అనుబంధాన్ని తెగదెంపులు చేయదలుచుకుంటే, అది రెండు రాష్ట్రాలకు పరిమితం కాదని, గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, గ్రేటర్ రాయలసీమలను ఏర్పాటు చేయాల్సి వస్తుందని వివరించారు. తెలంగాణతో పోలిస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తా ప్రాంతంలోని రెండు జిల్లాలు వెనకబడి ఉన్నాయని వివరించారు. దీనికితోడు తెలంగాణను ఏర్పాటు చేస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక డిమాండ్లు వస్తాయని వివరించారు. జలవివాదాలు పెరుగుతాయని, ఎన్నో ప్రాజెక్టులు మూల పడతాయని, రాజకీయ అస్థిరత, శాంతి భద్రతల సమ స్య, నక్సలైట్ల హింసాకాండ పెరిగిపోతాయని వివరించారు.

"2009 ఎన్నికల్లో తెలంగాణ పేరు ప్రస్తావించకుండానే రాహుల్, వైఎస్ఆర్ రాష్ట్రంలో పర్యటించారు. మీరు స్వయంగా జై ఆంధ్రప్రదేశ్ అన్నారు. అయినా తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో 12 కాంగ్రెస్ గెలుచుకుంది'' అని సీమాంధ్ర ఎంపీలు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే, రెండు రాష్ట్రాల్లోనూ కాం గ్రెస్ ఓడిపోతుందని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ, హైదరాబాద్, ఖమ్మంలలో పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. ప్రధానిని కలిసిన వారిలో కేఎస్ రావు, కేవీపీ రామచంద్ర రావు, కనుమూరి బాపిరాజు, అనంతవెంకటరామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సాయిప్రతాప్, కిల్లి కృపారాణి, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు.

English summary
PM Manmohan Singh made comment on telangana issue with CPI leader. CPI state secretary along with his party leaders met PM to appeal to resolve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X