తెలంగాణ: ఉండాలని కెసిఆర్‌ను అడిగిన ఆజాద్

శుక్రవారం పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత బయటకు వస్తున్న కెసిఆర్‌ను ఆపి కొద్ది రోజులు ఢిల్లీలో ఉండాలని ఆజాద్ అడిగారు. ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటున్నారని, మరో రెండు రోజులు ఉంటానని కెసిఆర్ చెప్పారని, ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి ఉంది - కొద్ది రోజులు ఉండాలని ఆజాద్ చెప్పారని సమాచారం. దీంతో మరో రెండు రోజుల్లో కెసిఆర్, ఆజాద్ మధ్య భేటీ ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తున్నట్లు చెప్పి కెసిఆర్ రెండు రోజుల క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణపై సెప్టెంబర్ చివరిలోగా తెలంగాణ తేలుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణకు అనుకూలంగా యుపిఎ ప్రభుత్వం నిర్ణయం వెలువరిస్తుందని కొద్ది కాలం క్రితం నుంచి ఆయన ధీమాగా చెబుతున్నారు.
అయితే, కెసిఆర్ మాటలను ఇతర పార్టీలు గానీ, తెలంగాణ ప్రజా సంఘాలు గానీ విశ్వసించడం లేదు. రెండు రోజుల క్రితం తెలంగాణ జెఎసి నేతలు గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ఆశ తమకు ఆ సమయంలో కనిపించలేదని, తాము ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే నిర్ణియంచుకున్నామని వారు చెప్పారు. ఈ నెల 30వ తేదీన జెఎసి తెలంగాణ మార్చ్ నిర్వహించనుంది.
తెలంగాణకు అనుకూలంగా యుపిఎ నిర్ణయం తీసుకుంటుందని తనకు సంకేతాలు అందాయని కెసిఆర్ చెప్పిన మాటలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా కొట్టిపారేస్తున్నారు. ఉద్యమాన్ని నీరు గార్చడానికే కెసిఆర్ ఆ విధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన శనివారంనాడు విమర్శించారు.












Click it and Unblock the Notifications