ఎల్లుండే.. తిరుమలలో అరుదైన ఘట్టం- మైసూరు మహారాజావారి కోసం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శనివారం నాడు 74,096 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,562 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.66 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే నాలుగు లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.98 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,890 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

కాగా.. ఈ నెల 22న తిరుమలలో అరుదైన ఉత్సవం జరుగనుంది. మలయప్ప స్వామివారు తిరుమలలో గల కర్ణాటక ఛౌల్ట్రీకి వెళ్లే ఘట్టం అది. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్నిపురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది పల్లవోత్సవంగా మారింది. కర్ణాటక సత్రానికి విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు ఆలయానికి భూరి విరాళాలు అందించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా అయిదోవ రోజు ఉదయం ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలు, అద్భుత కళాకృతులతో తయారుచేయించారు.
ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండంగా వెలిగే బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజూ అయిదు కేజీల నెయ్యి ఇచ్చే సాంప్రదాయాన్ని మైసూరు మహారాజు తన హయాంలో ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.
మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతినెలా ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications