• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖర్మ పట్టలేదు, బాబు హస్తం చూపిస్తున్నారు: వాసిరెడ్డి

By Srinivas
|

Vasireddy Padma
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో విలీనం కావాల్సిన అవసరం తమకు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి శనివారం ప్రకటించారు. జగన్ పార్టీ కాంగ్రెసు పార్టీలో భవిష్యత్తులో విలీనం కావొచ్చు అన్న వార్తలు రావడంతో ఆ పార్టీ నేతలు శనివారం స్పందించారు. కాంగ్రెసు మునిగిపోతున్న నావ వంటిదని, అలాంటి పార్టీలో విలీనం కావాల్సిన గత్యంతరం లేదని, తమకు ఆ ఖర్మ పట్టలేదని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటామని వారు అన్నారు.

విలీనమయ్యే అవకాశముందన్నట్లుగా పిటిఐ వార్తా సంస్థ ఇచ్చిన కథనం అవాస్తవమని, తాము ఆ సంస్థకు పంపిన ఖండనను ఎందుకు ప్రకటించలేదని వారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వ విధానాలను తాము ఎండగడుతున్న తమను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. జగన్ కాంగ్రెసు నుండి బయటకొచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, అక్రమంగా ఆయనను జైలు పాలు చేసినప్పటికీ మేం ప్రజల మధ్యే ఉన్నామన్నారు.

తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూడా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ భర్త బాటలో నడుస్తున్నారని, అలాంటి మాకు విలీనం కావాల్సిన అవసరమేముందన్నారు. విజయమ్మ ఫీజు దీక్షకు వచ్చిన మద్దతును ఓర్వలేకే కొన్ని దుష్టశక్తులు ఇలాంటి ప్రచారం చేశాయన్నారు. రాష్ట్రంలో తమపట్ల కొన్ని పత్రికలు, ఛానళ్లు చాలాకాలంగా పనిగట్టుకొని వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మడం లేదన్నారు.

పిటిఐ లాంటి సంస్థ కూడా విజయమ్మ ఇంటర్వ్యూకి వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరమని, అందులో ఉన్న కొందరు కోవర్టుల వల్లే ఈ కథనం వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి ఆశయసాధన కోసం జగన్ కాంగ్రెసు నుండి బయటకు వచ్చారని, ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉద్యమిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తమ బాధ్యత నిర్వర్తించకపోగా తమను ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తోందన్నారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో కూడా జగన్ బిజెపిలో కలిసిపోతున్నారంటూ ప్రచారం జరిగిందని, వారి అనుకూల మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసిందని, తమ పార్టీని, జగన్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకు చంద్రబాబు నిత్యం కుట్ర పన్నుతూనే ఉన్నారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ కాంగ్రెసులో విలీనం అవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే భారీ మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారన్నారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని, అప్పుడు ఎవరు కుమ్మక్కు అయ్యారో తేలుతుందని సవాల్ విసిరారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు నేతలతో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే అప్పటి నుండి బాబు విక్టరీ సింబల్‌కు బదులుగా ప్రజలకు హస్తం చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary

 YSR Congress party spokes person Vasireddy Padma said on Saturday that TDP chief Nara Chandrababu Naidu changed his victory symbol recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X