chiranjeevi kanna laxminarayana congress eluru west godavari చిరంజీవి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెసు ఏలూరు పశ్చిమ గోదావరి
చిరు ఫ్లెక్సీ పెట్టాలంటూ కాంగ్రెసు సభలో ఫ్యాన్స్ రచ్చ

వేదికపై తమ నాయకుడి బొమ్మ లేదంటూ చిరంజీవి అభిమానులు సమావేశాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెసు పార్టీలో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను కావాలనే పక్కన పెడుతున్నారని వారు విమర్శించారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు, మంత్రి కన్నా లక్ష్మినారాయణ వారించినా వారు వినలేదు. చిరంజీవి ఫొటో పెట్టాల్సి ఉండిందని, మరిచిపోయి పెట్టలేదని, అది పొరపాటేనని కన్నా లక్ష్మినారాయణ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
కోటగిరి విద్యాధర రావు జోక్యం చేసుకుని - చిరంజీవి అంటే మీకు ఎంత అభిమానం ఉందో మాకూ అంతే అభిమానం ఉందని చెప్పారు. విలీనం తర్వాత చిరంజీవి కాంగ్రెసు పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నారని, కాంగ్రెసులో చిరంజీవిని గుర్తించే రోజు వస్తుందని, దాంతో చిరంజీవి దానంతటదే వేదిక మీదికి వస్తుందని అన్నారు. తన మీద, చిరంజీవి మీద అభిమానం ఉంటే గొడవ చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.
చిరంజీవి కాంగ్రెసు నాయకుడేనని కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. అయినా చిరంజీవి అభిమానులు వినలేదు. నినాదాలు చేశారు. ఎంతకీ వారు వినకపోవడంతో చిరంజీవి బొమ్మ తీసుకుని వచ్చి వేదికపై పెట్టారు. దీంతో చిరంజీవి అభిమానులు శాంతించారు. కోటగిరి విద్యాధర రావు కూడా ప్రజారాజ్యం పార్టీలో ఉండి విలీనం తర్వాత కాంగ్రెసు నాయకుడయ్యారు. గత ప్రజారాజ్యం పార్టీలో ఆయన కీలక భూమిక పోషించారు.