భార్య, పిల్లలకు గిఫ్ట్‌లు ఇచ్చినా పన్ను కట్టాల్సిందే?
చాలా మంది తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి లేదా ఆస్తులను బదిలీ చేయడానికి హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) నుండి భార్యకు లేదా వివాహిత కుమార్తెలకు షేర్లు, నగదును బహుమతిగా ఇస్తుంటారు. అయితే, ఇలాంటి బహుమతులపై ఆదాయపు పన్ను శాఖ కన్ను ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్ను ఆదా కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలు ఒక్కోసారి అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉంది.
చట్టపరంగా హెచ్‌యూఎఫ్ తన ఆస్తులను సభ్యులకు బహుమతిగా ఇచ్చే అధికారం ఉంది. అయితే, ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ దీనికి ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. అలాగే, ఆ బహుమతి విలువ మరీ ఎక్కువగా ఉండకూడదు. కేవలం కుటుంబ పోషణ, పిల్లల పెళ్లిళ్లు లేదా మతపరమైన కారణాల రీత్యా ఇచ్చే బహుమతులకే చట్టబద్ధత ఉంటుంది.

ఆదాయ పంపిణీ వేరు.. ఆస్తుల బదిలీ వేరు!
ఆదాయపు పన్ను చట్టం, 2025లోని నూతన నిబంధనల (సెక్షన్ 11) ప్రకారం.. హెచ్‌యూఎఫ్ నుండి సభ్యులకు జరిగే 'ఆదాయ పంపిణీ'కి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ, హెచ్‌యూఎఫ్ ఆస్తులను (షేర్లు, డిబెంచర్లు వంటివి) నేరుగా బహుమతిగా ఇవ్వడం ఈ మినహాయింపు పరిధిలోకి రాదు. దీనివల్ల బహుమతి అందుకున్న వ్యక్తి దానిపై భారీగా పన్ను చెల్లించాల్సి రావచ్చు.
పాక్షిక విభజన చెల్లదు.. 'క్లబ్బింగ్' ముప్పు!
హెచ్‌యూఎఫ్ ఆస్తులను కొంతమంది సభ్యులకే బహుమతిగా ఇవ్వడాన్ని ఐటీ శాఖ 'పాక్షిక విభజన' (Partial Partition) గా పరిగణిస్తుంది. మన పన్ను చట్టాల్లో పాక్షిక విభజనకు గుర్తింపు లేదు. దీనివల్ల 'క్లబ్బింగ్ నిబంధనలు' అమల్లోకి వస్తాయి. అంటే, ఆ బహుమతి ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని (ఉదాహరణకు షేర్ల మీద వచ్చే డివిడెండ్) తిరిగి హెచ్‌యూఎఫ్ ఖాతాలోనే వేసి పన్ను విధిస్తారు. పూర్తి విభజన జరిగే వరకు ఈ తలనొప్పి తప్పదు.
రూ. 50,000 లిమిట్ దాటితే టాక్స్ పక్కా!
సాధారణంగా బంధువుల నుండి వచ్చే బహుమతులకు పన్ను ఉండదు. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో 'బంధువుల' జాబితాలో హెచ్‌యూఎఫ్ ఉండదు. దీనివల్ల ఇతర వనరుల నుండి వచ్చే బహుమతులతో కలిపి, హెచ్‌యూఎఫ్ గిఫ్ట్ విలువ ఏడాదికి రూ. 50,000 దాటితే, దానిని తీసుకున్న వ్యక్తి తాలుకా ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు.
వ్యాజ్యాల ప్రమాదం.. జాగ్రత్త!
కొన్ని సందర్భాల్లో కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు ఈ బహుమతులపై సానుకూల తీర్పులు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ట్యాక్స్ అధికారులు వీటిని అంగీకరించకపోవచ్చు. దీనివల్ల నోటీసులు రావడం, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చుతో కూడిన న్యాయ పోరాటాల కంటే, ఇలాంటి లావాదేవీలకు దూరంగా ఉండటమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మీ హెచ్‌యూఎఫ్ నుండి సభ్యులకు బహుమతులు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించడం ఉత్తమం. లేదంటే పన్ను ఆదా మాట పక్కన పెడితే, పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications