రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెట్ గాలాలో హైదరాబాదీ మహిళ సందడి !!
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్ గాలా వేడుకలో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి తన విలక్షణమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆమె ధరించిన దుస్తులు, కోట్ల రూపాయల ఆభరణాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాగా సుధా రెడ్డి ధరించిన నెక్లెస్ విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు (రూ. 142.8 కోట్లు) అని సమాచారం. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నెక్లెస్ విక్టోరియన్ ఫినిషింగ్, పెద్ద రోజ్-కట్ డైమండ్స్‌తో రూపొందించారు. దీని మధ్యలో 550 క్యారెట్ల లోతైన నీలిరంగు టాంజనైట్ లాకెట్ ప్రధాన ఆకర్షణ. టాంజానియాలోని మెరలానీ కొండల్లో లభించే ఈ రత్నం 'క్వీన్ ఆఫ్ మెరలానీ'గా సుప్రసిద్ధం. నెక్లెస్‌తో పాటు ఆమె 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్‌ను ధరించారు. అలానే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తులు 'ట్రీ ఆఫ్ లైఫ్' (జీవన వృక్షం) థీమ్‌తో రూపుదిద్దుకున్నాయి.

పురాతన కలంకారీ కథన సంప్రదాయాల నుంచి స్ఫూర్తితో, పాలపిట్ట, జమ్మిచెట్టు, కల్పవృక్షం, తంగేడు వంటి తెలుగు మోటిఫ్‌లను దీనిపై అందంగా పొందుపరిచినట్టు స్పష్టం చేశారు. దుస్తుల ద్వారా హైదరాబాద్ సంస్కృతిని, తెలుగు జీవన విధానాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే తన లక్ష్యమని సుధా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు. ఈ మేరకు ఆ పోస్టులో "హైదరాబాద్ నా మూలం మాత్రమే కాదు.. అదొక భాష, ఒక జీవన లయ. ఈ డ్రెస్ కేవలం అలంకరణ కాదు, ఇది తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక జీవన సంగ్రహం" అని ఆమె పేర్కొన్నారు.
ఇక సుధా రెడ్డి ఎంఈఐఎల్ (MEIL - Megha Engineering & Infrastructures Ltd) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి భార్య. ఆమె కేవలం ఒక పారిశ్రామికవేత్త భార్యగానే కాకుండా.. ఆ సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన ముద్ర వేశారు. ఆమె పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగడానికి ప్రధాన కారణం ఆమె ఫ్యాషన్ సెన్స్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'మెట్ గాలా' (Met Gala) రెడ్ కార్పెట్‌పై మెరిసిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె ఒకరు. 2021లో తొలిసారిగా మెట్ గాలాలో అడుగుపెట్టారు.
మరోవైపు ఆమె కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, 'సుధా రెడ్డి ఫౌండేషన్' ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం, పిల్లల చదువులకు సహాయం చేయడం.. మహిళా సాధికారత కోసం ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 'గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్' వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.












Click it and Unblock the Notifications