'హైదరాబాద్'కు దెబ్బ: మార్చ్‌పై టి-మంత్రులతో కిరణ్

29న గణేష్ నిమజ్జనం ఉందని, అది 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే అవకాశం ఉందని, ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనం జరుగుతుందని, అదే ప్రాంతంలో తెలంగాణ మార్చ్‌కు సన్నద్దమవుతున్నారని, ఆ తర్వాతి రోజే అంటే అక్టోబర్ 1 జీవ వైవిధ్య సదస్సు ప్రారంభమవుతోందని, ఈ సమయంలో ఏదైనా ఘర్షణ చోటు చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని, దీనికి తోడు, గణేశ్ నిమజ్జనంలో అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు చేరి మత ఘర్షణలు చోటు చేసుకునేలా వ్యూహాలు రచిస్తే.. దాని ప్రభావం రాష్ట్రమంతటికీ పాకే ప్రమాదం ఉంటుందని కిరణ్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కోరదామని సిఎం చెప్పారు. శాసనసభ శుక్రవారం సజావుగా సాగితే సభలోనే తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని అభ్యర్థిస్తానని సీఎం చెప్పారు. అలాగే, అసెంబ్లీ ప్రాంగణంలోనే శాసనసభా పక్ష నేతలతో సమావేశమవుతానని మంత్రులకు సిఎం వివరించారు. గణేశ్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు తర్వాత తెలంగాణ మార్చ్ నిర్వహించినా అభ్యంతరం లేదన్న సంకేతాన్ని స్పష్టం చేయాలని తెలిపారు.
మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా కోరాలని సిఎం సూచించారు. ఇప్పటికే తనను కలుస్తున్న పలు సంఘాల నేతలతోనూ.. జెఏసి నేతలతోనూ ఇదే విషయాన్ని వివరిస్తున్నానని హోం మంత్రి సబిత చెప్పారు. కోదండరాం మినహా మిగిలిన జెఏసి నేతలు తనను కలిశారని ఆమె వివరించారు. కోదండరాం తదితర నేతలతో మాట్లాడి తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఒప్పిద్దామని దానం నాగేందర్, శ్రీధర్ బాబు, డికె అరుణ తదితరులు సూచించారు.












Click it and Unblock the Notifications