తెలంగాణ హీట్: ఈ వారమే సోనియాతో కెసిఆర్ భేటీ

K Chandrasekhar Rao-Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ జెఎసి తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ వారమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశాలున్నాయి. గత పదిహేను రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసిన కెసిఆర్ కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చి, ఇరు పక్షాలకు అంగీకారయోగ్యమైన తర్వాత కెసిఆర్ లాంఛనంగా సోనియాను కలుస్తారని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడమే తరువాయి కాంగ్రెసులో తెరాసను విలీనం చేయడానికి సిద్ధపడుతూ కెసిఆర్ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపైన కన్నా తెరాస విలీనంపైనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు సానుకూలంగా ప్రకటన చేయడానికి కాంగ్రెసు పెద్దలు సూచనప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అంశం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనని భావిస్తున్నారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ తీసుకున్న విధంగానే తెలంగాణపై కూడా సాహసోపేత నిర్ణయం తీసుకోవడానికే కాంగ్రెసు పెద్దలు సిద్ధపడినట్లు చెబుతున్నారు. వివిధ మార్గాల ద్వారా సమాచార సేకరణ జరుపుతూ, రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెసు అంచనా వేస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ముప్పావు గంట సోనియా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 23వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణపై ప్రకటన, ఆ తర్వాత ముఖ్యమంత్రి మార్పు, తెరాస విలీనం అనే మూడు అంశాల మీదనే కాంగ్రెసు పెద్దలు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ మూడు అంశాలపై తెలంగాణ మార్చ్‌కు ముందే ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

తెరాస విలీనమా, తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పదవా అనే రెండు అంశాల చుట్టూ తిరిగిన కాంగ్రెసు పెద్దలు తెరాస విలీనంవైపే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన వెలువరించడానికి కాస్తా ముందో, వెనకో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో ఏ ప్రైవేట్ సంస్థతో సర్వే నిర్వహించిన తర్వాతనే సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా కదిలినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ మంత్రులు పెద్దగా సహకరించకపోవడం కూడా తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుందనే సంకేతాలు అందడం వల్లనే అంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన తెలంగాణ మంత్రుల సమావేశానికి ఆరుగురు డుమ్మా కొట్టారు. తెలంగాణ మంత్రులు ఇప్పుడు పార్టీలో కెసిఆర్ ప్రాబల్యానికి అడ్డుపడడానికి మాత్రమే చూస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప శుక్రవారంనాడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాను షిండేను కోరినట్లు ఆయన తెలిపారు. పరిణామాలు చూస్తుంటే, అన్ని వైపుల నుంచి కాంగ్రెసు అధిష్టానం సమాచారం తెప్పించుకుంటూ రాజకీయ సమీకరణాలను, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+