ఎమ్మార్‌పై ఈడి కొరడా: రూ.71 కోట్ల ఆస్తుల జప్తు

మొత్తం 71.27 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు మంగళవారం ఈడీ తెలిపింది. ఎమ్మార్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, ఎమ్మార్ ప్రతినిధులు శ్రవణ్ గుప్తా, విజయ రాఘవ, జగన్ సన్నిహిత సహచరుడు సునీల్ రెడ్డి తదితరులను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. కొనుగోలుదారుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేసి, రికార్డుల్లో మాత్రం తక్కువగా చూపించారని... తద్వారా ఏపీఐఐసీని మోసగించారని సీబీఐ ఇప్పటికే గుర్తించింది.
భారీగా గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించుకున్న ఈడీ ఇప్పుడు ఆస్తుల జప్తు చేపట్టింది. "ఎమ్మార్ ఎంజీఎఫ్ లిమిటెడ్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్, స్టైలిష్ హోమ్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందాలు కుట్రపూరితమైనవి. ఈ మూడు కంపెనీలు విల్లాలను భారీ మొత్తానికి విక్రయించాయి. కానీ... ఏపీఐఐసీని మోసగించేందుకు రికార్డుల్లో తక్కువ మొత్తాన్ని చూపించాయి'' అని ఈడీ దర్యాప్తులోనూ స్పష్టమైనట్లు తెలిసింది. ఎమ్మార్‌లో ఒక్కోటి సుమారు 1500 చదరపు గజాల స్థలాన్ని విల్లాలకు కేటాయించారు.
ఏకంగా 31 విల్లా ప్లాట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇవి ఎవరివి అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే, వివిధ కంపెనీలకు విక్రయించినట్లుగా సేల్‌డీడ్ మాత్రం రాసుకుని, రిజిస్ట్రేషన్ జరగని విల్లా ప్లాట్లు 18 వరకు ఉన్నాయి. ఇందులో 2 ఎమ్మార్ ఎంజీఎఫ్ సీఈవో, శ్రీకాంత్ జోషి పేరిట, మరో రెండు ఎమ్మార్ ఆర్థిక విభాగం ఎమ్మార్ ఎంజీఎఫ్ ఎండీ శ్రవణ్ గుప్తా భార్య పేరిట ఉన్నట్లు సమాచారం. మిగిలిన 18 ఎవరి 'ఖాతా'లో ఉన్నాయో తెలియదు. ఇప్పుడు జప్తు చేసిన 31 ప్లాట్లలో ఇవి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications