హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సాకు: వారి టార్గెట్ కిరణ్ కుమార్ రెడ్డే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కొంత మంది మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ అంశాన్ని సాకుగా తీసుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకున్నట్లు ఆయన వర్గం నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కవాతు సందర్భంగా తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినట్లు, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని రచించి అమలు చేసినట్లు భావిస్తున్నారు.

కాగా, తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల్లో ఎక్కువ మంది మొదటి నుంచీ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. తెలంగాణ అంశాన్ని చూపించి పొన్నం ప్రభాకర్ వంటివారు ఎప్పటికప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలియంది కాదు. తెలంగాణకు చెందిన శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి వంటి మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి బాసటగా నిలుస్తుండగా కొంత మంది తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యతిరేకతను తెలంగాణకు సంబంధించి అంశం ముందుకు వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తున్నారని అంటున్నారు.

తెలంగాణ పట్ల సీనియర్ మంత్రి కె. జానా రెడ్డికి చిత్తశుద్ధి లేదని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. అయితే, జిల్లా రాజకీయాల్లో ఇరువురికి మధ్య పొసగకపోవడం కూడా ఆ వ్యాఖ్యకు కారణమని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై తాజాగా పార్లమెంటు సభ్యుడు జి. వివేక్‌ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అందులో కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 52 చోట్ల కాంగ్రెసు పోటీ చేస్తే 50 చోట్ల ఓడిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంకు కూడా గణనీయంగా పడిపోయిందని అన్నారు.

అయితే, కాంగ్రెసు నేతల వాదనలు మరో రకంగా ఉన్నాయి. తెలంగాణపై ఏదో ఒకటి చేయాల్సిన అనివార్యతలో తెలంగాణ మంత్రులు పడ్డారని, అందువల్లనే తమ వంతు తోడ్పాటు అందించారని అంటున్నారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి రాజీనామాలు చేయడం వంటి తీవ్రమైన చర్యలకు దూరంగా ఉంటూ, ఏదో రకంగా తాము ఉద్యమిస్తున్నామని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మంత్రుల్లోనూ, పార్లమెంటు సభ్యుల్లోనూ ఇద్దరు ముగ్గురు మాత్రమే చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అనడాన్ని ఈ సందర్భంగా గుర్తించాల్సి ఉంటుంది.

తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లనే తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, తెలంగాణ మంత్రులు ప్రతిస్పందిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ కవాతు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు వెళ్లకుండా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పార్లమెంటు సభ్యులు ధర్నా చేయడం వెనక కూడా వ్యూహం ఉందని అంటున్నారు. నెక్లెస్ రోడ్డుకు వెళ్తే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కావచ్చునని భావించారని, అదే సమయంలో తమ ఉద్యమంలో గట్టిగా ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చిందని, దీనివల్లనే వారు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద బైఠాయించి, అరెస్టయినట్లు చెబుతున్నారు.

మొత్తం మీద, తెలంగాణ అంశం కాంగ్రెసులో ప్రాంతాలవారీగా చిచ్చు పెట్టడమే కాకుండా, అధికారం కోసం ప్రయత్నాలకు పావుగా వాడుకునే అస్త్రంగా కూడా ఉపయోగపడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి పీఠంపైన కన్నేసినట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందువల్ల తెలంగాణ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

English summary
According to political analysts - Telangana ministers and MPS made target CM Kiran Kumar Reddy using Telangana issue. They want to make Kiran kumar Reddy weak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X