పిఆర్పీయే లేకుంటే: బాబు, జగన్, కాంగ్రెస్‌పై నిప్పులు

తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడి యాత్ర చేయడం లేదని, అది తనకు కొత్త కాదని, దానిని తాను ఇప్పటికే తొమ్మిదేళ్ల పాటు చేశానని, పదవీ కాంక్షతో, అధికారం కోసం నేను మీ దగ్గరకు రాలేదన్నారు. రాజకీయ ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దోపిడీలను ప్రజలకు వివరించడానికే వచ్చానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీపై ప్రజలను చైతన్యపరచడానికే వచ్చినట్లు చెప్పారు.
ఈ వయసులో పాదయాత్ర మంచిది కాదని, ఆరోగ్యం సహకరించదని అందరూ సూచించారని, కానీ, ప్రజల శ్రేయస్సు కోరి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ త్యాగానికైనా సిద్ధమని, ప్రాణం పోయినా పాదయాత్ర కొనసాగిస్తానని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నదే తన జీవితాశయమని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా పోరాటం సాగిస్తానని శపథం చేశారు. టీడీపీని అప్రతిష్ఠపాలు చేయడానికి అన్ని పార్టీలూ కుట్రలు పన్నుతున్నాయని, వాటి కుట్రలకు ఏమాత్రం వెనకాడేది లేదని స్పష్టం చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తితోనే పాదయాత్ర చేపట్టానన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీ ఏనాడో చెప్పారని, ప్రస్తుతం దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక న్యాయం రెండూ మాయమయ్యాయన్నారు. పేదరిక నిర్మూలనే తన జీవితాశయమని, అందుకోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దేశంలోను, రాష్ట్రంలోను అవినీతి పెరిగిపోయిందని, కుంభకోణాలు జరగకుంటే ప్రజలపై ఈ భారం మోపాల్సిన అవసరం ఉండేది కాదని విమర్శించారు.
ప్రభుత్వాల్లో చోటు చేసుకున్న అవినీతి కారణంగా సామాన్య జనం బతుకే భారంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 30 ఏళ్ల్లు వెనక్కు తీసుకు వెళ్లిందని, బీహార్, గుజరాత్ వంటి వెనకబడ్డ రాష్ట్రాలు కూడా నేడు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాయని, అవినీతి పాలకుల పుణ్యమా అని మన రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఎంతగా పెరిగిందంటే.. కేబినెట్ సమావేశాన్ని కూడా చంచలగూడ జైలులో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ వల్లనే ఈ దుస్థితి వచ్చిందని, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ లేకుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. "ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఉంది. చేనేత పరిస్థితి దారుణంగా తయారైంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఓబుళాపురం గనులను కొల్లగొట్టారని, లేపాక్షి భూములను దోచుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ బాగుపడరని, రైతులు, విద్యార్థులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలు ఎవరికీ న్యాయం జరగదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్‌డిఐలను ఆహ్వానిస్తోంది. దీంతో కిరాణా షాపులు, తోపుడు బండ్ల కార్మికులు బజారునపడతారు. సామాన్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వాలున్నాయి'' అని ధ్వజమెత్తారు. చదువుకోవాలంటే ఫీజులు కట్టలేని, చదువుకున్నా ఉద్యోగం రాని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారని, ఇటువంటి భయంకర పరిస్థితిలో రాష్ట్రం ఉందని చెప్పారు. ఆర్థిక స్వాతంత్య్రం తీసుకు రావాలన్న సంకల్పంతోనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని, ఆ దిశగానే తాము పార్టీని ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ హయాంలోనే బిసి డిక్లరేషన్ ఇచ్చామని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణను టీడీపీ బాధ్యతగా తీసుకుంటుందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లోనే అమలు చేస్తామన్నారు. వారికి 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారు. అధికారంలోకి వస్తే అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక పాలసీ తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. టిడిపిని దెబ్బతీయడానికి అన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఒక్క నాయకుడు పోతే వందమందిని తయారు చేసే శక్తి టిడిపికి ఉందన్నారు.
2009 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు నేడు బజారులో పశువుల్లా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు అమ్ముడుపోయారని, నాడు టిక్కెట్ల కోసం వచ్చినప్పుడు పార్టీ సిద్ధాంతాలు వారికి తెలియవా అని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా కొందరు ఎంపీలను కొనుగోలు చేశారని, అదే బాటలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసుతో పాటు టిఆర్ఎస్ కూడా ఏదో ఒకరోజు కాంగ్రెస్‌లో కలిసిపోయేదేనని చెప్పారు. ధర్మం, న్యాయం కోసమే ఈ ప్రజా పోరాటం తప్ప అధికారం కోసం కాదన్నారు.
రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఉద్యమానికి తెరదీశానని తెలిపారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాదయాత్రకు మద్దతు పలకాలని కోరారు. ప్రజా స్పందన చూసి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నారు. కాగా నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్రను చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మంగళవారం రాత్రి 7.07 గంటలకు ప్రారంభించారు. వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వేద పండితులు బాబును ఆశీర్వదించారు.
అక్కడినుంచి పొట్టి శ్రీ రాములు సర్కిల్ మీదుగా 7.48 గంటలకు జామియా మసీదుకు చేరుకున్నారు. అక్కడ ప్రార్థనలు జరిపి ముతవలీ ఆశీస్సులు పొందారు. గాంధీ సర్కిల్ మీదుగా రాత్రి 8.50 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని, బహిరంగసభలో ప్రసంగించారు. రాత్రి 9.52 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు. అంబేద్కర్ సర్కిల్ మీదుగా ప్రఖ్యాత సీఅండ్ఐజీ మిషన్ చర్చికి చేరుకున్నారు. చర్చిలో ప్రార్థనలు జరిపి ఫాదర్ల ఆశీర్వాదం పొందారు. అనంతరం మేళాపురం క్రాస్‌లో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి చేనేత కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీఎంటీ లే అవుట్‌లో భోజనం చేసి బసచేశారు. పాదయాత్ర తొలిరోజు చంద్రబాబు 8.5 కిలోమీటర్లు నడిచారు.