వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లేకుండా కెసిఆర్ ప్రతిపాదన: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీ అధిష్టానం పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్ర విభజన చేయాలని తనంత తానుగా ప్రతిపాదన పెట్టారని, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ప్రతిపాదన పెట్టకుండానే కెసిఆర్ అందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు.

తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంసంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు 16 పేజీల నివేదిక సమర్పించిన తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాదు లేకుండా తెలంగాణ తీసుకుందామని కెసిఆర్ తన పార్టీ శాసనసభ్యులకు కూడా చెప్పారని ఆయన అన్నారు. కెసిఆర్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలువలేదని, మిగతా కేంద్ర మంత్రులు మర్యాదపూర్వకంగానే కెసిఆర్‌తో మాట్లాడారని ఆయన అన్నారు.

చర్చల కోసం కెసిఆర్‌ను ఎవరూ పిలువలేదని, తెలంగాణ మార్చ్‌ను తప్పించుకోవడానికే కెసిఆర్ ఢిల్లీ వచ్చారని, గడువు ముగియగానే హైదరాబాదుకు జారుకున్నారని, మళ్లీ చర్చలంటూ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ సాధ్యం కాదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహా కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే వంటివారు చెప్పినా చర్చలంటూ కెసిఆర్ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ మార్చ్‌కు 30 వేల మంది కూడా హాజరు కాలేదని, మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి తెలంగాణ జెఎసి మాట తప్పిందని ఆయన విమర్శించారు. లక్షలాది మందితో ఇంతకు ముందు సభలు నిర్వహించినా ఏమీ కాలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని ఆయన అన్నారు. కొద్ది పాటి సీట్లను మాత్రమే ఆ సభల ద్వారా రాజకీయ పార్టీ సాధించుకుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆడ్డం పెట్టుకుని కొంత మంది దోచుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ మార్చ్ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగుజాతి ప్రతిష్ట దెబ్బ తినకుండా చూడాలని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని, అందువల్ల తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని వెంటనే తేల్చి చెప్పాలని తాను హోం మంత్రిని కోరానని ఆయన అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలుగు రాని మజ్లీస్ అధినేత ఓవైసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటున్నారని, తెలుగు జాతికి చెందిన కొంత మంది గోడమీది పిల్లివాటంగా ఉన్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి అన్నారు.

తమ పార్టీ మీద కెసిఆర్‌కు నమ్మకం ఉంటే తమ కాంగ్రెసు పార్టీకే ఓటేయాలని చెప్పవచ్చు కదా, తమని ద్రోహులని నిందించడం ఎందుకుని ఆయన అడిగారు. తాను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపానని, మళ్లీ జరుపుతానని కెసిఆర్ చెప్పడాన్ని ఆయన అబద్ధంగా చెప్పారు. కేంద్రం దొంగచాటుగా చర్చలు జరపబోదని లగడపాటి అన్నారు. బుకాయించడానికి, కాలయాపన చేయడానికి రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పరకాల ఉప ఎన్నిక తర్వాత తన బలం తగ్గిపోతుందని గుర్తించి, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణ ఇవ్వాలని కెసిఆర్ ప్రతిపాదన పెట్టారని ఆయన అన్నారు.

English summary
Congress Seemandhra MP Lagadapati Rajagopal said that Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has proposed Telangana without Hyderabad. He saif that no body has invited KCR for talks on Telangana to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X