తెలంగాణ ఇష్యూ: అసలు ఏం జరుగుతోంది?

అఖిల పక్ష సమావేశం ఉండదని కూడా ఆయన తేల్చేశారు. దీంతో కెసిఆర్‌పై విమర్శలు ప్రారంభమయ్యాయి. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర నాయకులు తాము చెప్పిందే జరుగుతోందని మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై ఏం జరుగుతుందనేది చాలా మందికి ఆసక్తికరంగానే ఉంది. సుశీల్ కుమార్ షిండే వంటి నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నా తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాత్రం నోరు విప్పడం లేదు.
నిజానికి, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. కెసిఆర్ మాత్రమే చెబుతున్నారని, కెసిఆర్ మాటల్లో ఎంత నిజం ఉందో చెప్పలేమని అంటున్నారు. అయితే, తెరాస వర్గాల్లో మాత్రం విశ్వాసం వ్యక్తమవుతోంది. కెసిఆర్ విశ్వాసానికి లేదా తెరాస వర్గాల నమ్మకానికి అనుకూలంగానే కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాటలు ఉన్నాయి. సుశీల్ కుమార్ షిండేతో కెసిఆర్ మాట్లాడలేదనే విషయం కొత్తదేమీ కాదని అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కెసిఆర్‌తో చర్చలు జరుపుతోందని అంటున్నారు.
కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు. రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ మాటలే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణపై నిర్ణయం వెలువవడుతుందని ఆయన ఒకటి రెండు సార్లు చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే నిర్ణయంలో కాంగ్రెసు జాప్యం చేస్తోందని అంటున్నారు.
తెలంగాణపై నిర్ణయం వెలువరించడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడిన ప్రతిసారీ సీమాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా అన్నారు. అయితే, అన్ని వైపుల నుంచి చర్చలు మాత్రం సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications