chandrababu naidu telugudesam vastunna meekosam anantapur చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తున్నా మీకోసం అనంతపురం
పాదయాత్ర: మాట్లాడుతూ సొమ్మసిల్లిన చంద్రబాబు

చంద్రబాబు కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తూలి పడి తిరిగి లేచారు. 120 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రకు ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా, విశ్రాంతి కూడా తీసుకోకుండా కొనసాగించడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలుపు ఎరుగకుండా ఆయన రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఎండ దెబ్బతో నీరసించడం వల్లనే చంద్రబాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విశ్రాంతి తర్వాత తేరుకుని ఆయన తిరిగి తన పాదయాత్ర ప్రారంభించారు.
అంతకు ముందు ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విరుచుకపడ్డారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో కూడా తెలియకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీలో బేరసారాలు చేయాలనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఎత్తుగడ అని ఆయన అన్నారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో ఆయన స్థానికులతో మాట్లాడారు. ప్రజలను ఉచిత విద్యుత్తు పేరిట కాంగ్రెసు మోసం చేసిందని విమర్శించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు.
విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ అంతుపట్టకుండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు పంట రాయితీ చెల్లింపు ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.