మందు బాబులకు బిగ్ అలర్ట్, మద్యం కావాలంటే ఇక..!!
మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు జరుగుతున్న విక్రయాల నిబంధనలను మార్పు చేస్తూ తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఇక నుంచి ఎవరైనా మద్యం కొనుగోలు చేయాలంటే 21 సంవత్సరాల వయసు ఉండాల్సిందే. అదే విధంగా ఆధార్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు కొత్త మార్పులతో మద్యం అమ్మకాల విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత మద్యం నియంత్రించే దిశగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతను డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయించిన విజయ్, తాజాగా విక్రయాల విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. తాజాగా మద్యం అమ్మకాల నిబంధనల్లో మార్పులు చేసారు. రాష్ట్రంలో పెరుగుతున్న మద్యపాన వ్యసనాన్ని అరికట్టేందుకు 21 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మకూడదని సీఎం విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) రంగంలోకి దిగింది.

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో
ఇకపై మద్యం కొనుగోలు చేసేవారు తమ వయస్సును నిరూపించుకోవడానికి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వయస్సు ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయకుండా 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించే షాపు యజమానులు, సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుకు పంపుతామని టాస్మాక్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాలు పని చేసే సమయాన్ని కూడా తగ్గించే దిశగా విజయ్ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు సాగుతున్నాయి. అయితే, నేరాలు, ప్రమాదాలను తగ్గించేందుకు దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications