మంత్రులపై తెలంగాణ ఒత్తిడి: పిఎంను కలిసే యత్నాలు

జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాదుకు రానున్నారు. తెలంగాణవాదులు ఆయన పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. టి కాంగ్రెసు ఎంపీలు కూడా ప్రధాని పర్యటనను స్వాగతించడం లేదు. సొంత పార్టీ ఎంపీలు తెలంగాణ కోసం తమ వంతు నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో మంత్రుల పైన తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో వారు ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం అపాయింటుమెంటు కూడా కోరినట్లుగా తెలుస్తోంది. అయితే వారికి అపాయింటుమెంట్ ఇప్పటి వరకు దొరకలేదని సమాచారం. తెలంగాణవాదం వినిపించేందుకు తమకు హైదరాబాదులో వీలుకాని పక్షంలో ఢిల్లీ వెళ్లేందుకు కూడా మంత్రులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే హైదరాబాదులో తమకు కలిసే అవకాశం లేకుంటేనే ఢిల్లీ వెళ్లాలని వారు యోచిస్తున్నారని తెలుస్తోంది.
ప్రధానిని కలిసి తెలంగాణ విషయంలో తమపై ఉన్న ఒత్తిడిని వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. అలాగే తెలంగాణ ఆవశ్యకతను, దానివల్ల కలిగే లాభాలను వారు ఆయనకు వివరించనున్నారని తెలుస్తోంది. పార్టీకి కలిగే లాభాన్ని కూడా వారు తెలపనున్నారు.












Click it and Unblock the Notifications