రాష్ట్ర రాజకీయాలు: తండ్రులకు తగ్గ తనయులేనా?
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అగ్రనేతలుగా వెలుగొందిన, వెలుగొందుతున్న నాయకుల కుమారులు, కూతుళ్లు రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నారు. ఇలాంటి కుటుంబాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. పివి నర్సింహారావు కుమారుడి నుంచి మొదలు పెడితే ఈనాటి నారా చంద్రబాబు నాయుడి తనయుడి వరకు అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. కొంత మంది ముఖ్యమంత్రుల కుమారులు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నికల్లో విజయం సాధిస్తున్నా వారు ఆ స్థానానికి చేరుకోలేకపోతున్నారు.

భారత మాజీ ప్రధాని పివి నర్సింహారావు కుమారుడు పివి రంగారావు రాష్ట్ర రాజకీయాల్లో కొంత కాలం తన చురుగ్గా ఉన్నారు. పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కాలం కలిసి రాక క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. పివి నర్సింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెసులో ముఖ్య నాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన కుమారులు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో వారు ఇప్పుడు అంత ప్రభావశీలంగా లేరు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఆధిపత్యం కాంగ్రెసు పార్టీలోనూ ఖమ్మం జిల్లాలోనూ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు జలగం ప్రసాద రావు కాంగ్రెసు ఎమ్మెల్సీగా ఉండగా, వెంకటరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో తన రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు తగిన పాత్ర లేకుండా పోయింది.

రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ తరఫున హైదరాబాదులోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి లేదు. ఆయన వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ విపత్తుల నివారణ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల్లో ఆయన పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన కుమారులు రాజకీయాల్లో క్రియాశీలకంగా సందడి చేయలేదు. నందమూరి హరికృష్ణ మాత్రం తండ్రి వెంట ఉండేవారు. ఎన్టీఆర్ ప్రచార రథాన్ని ఆయన నడిపేవారు. ఆ తర్వాత హరికృష్ణ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎన్టీ రామారావు మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల బరిలోకి దిగి రాజకీయాల్లో తన సత్తా చాటడానికి సిద్ధపడుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్ సంగతి చెప్పనే అవసరం లేదు. తండ్రి జీవించి ఉండగానే ఆయన కాంగ్రెసు పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. కడప లోకసభ స్థానం నుంచి పోటీ చేసి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించారు. ప్రస్తుతం జైల్లో ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి, తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు. జగన్ జైలులో ఉండడంతో వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన స్థితికి వచ్చేశారు. ఆమె ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మెల్లగా తండ్రి చెప్పుల్లో కాళ్లు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించడానికి మెల్లగా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చాలా మంది నాయకుల కుమారులు తమ తండ్రి స్థానాలను పొందలేకపోయారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్ మాత్రం తన తండ్రి చేపట్టిన ముఖ్యమంత్రి పదవిని సాధించుకోవడానికి ఏకంగా సొంత పార్టీనే స్థాపించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారా, లేదా అనేది భవిష్యత్తు తేలాల్సిందే.

ఎన్టీ రామారావు తనయులు బాలకృష్ణ, హరికృష్ణ కూడా తమ తండ్రి వారసత్వాన్ని సినమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా కొనసాగించాలని తాపత్రయపడుతున్నారు. కాగా, ఎన్టీ రామారావు తనయ దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీలో చేరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వీరికి తమ తండ్రుల వారసత్వం రాజకీయాల్లో ఏదో మేరకు ఉపయోగపడుతూనే ఉన్నది.












Click it and Unblock the Notifications