అన్న కోసమే షర్మిల యాత్ర: టిడిపి కరపత్ర యుద్ధం

ఎనిమిది రకాల కరపత్రాలను రూపొందించింది. ఆ పార్టీ నేత రావులపాటి సీతారామా రావు గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాటిని విడుదల చేశారు. ఈ కరపత్రాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని, వాటిపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించడానికి ఇవి ఉపకరిస్తాయని చెప్పారు. కరపత్రాల్లో పలు అంశాలను రూపొందించామన్నారు.
ధరల పెరుగుదల కారణంగా రాష్ట్రంలో నలభై శాతం మందికి పైగా రోజు కూలీపై వచ్చే ఆదాయంతో పొట్ట నింపుకోవడానికి కూడా చాలడం లేదని, పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికి 27సార్లు పెంచారని, నిత్యావసర ధరలు మూడువందల శాతం పెరిగాయని, ఇవన్నింటికి నగదు బదలీ పథకమే పరిష్కారమని, తెలుగుదేశం పార్టీతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని కరపత్రాల్లో తెలిపారు.
ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఇరవై రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పులు లక్షన్నర కోట్లకు పెరిగాయని, ఏ రంగంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని, శాంతి భద్రతల సంరక్షణ ను గాలికి వదిలేసి, నదీ జలాల వంటి రాష్ట్ర హక్కులను కాపాడలేకపోతున్నారన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి ఆకాశాన్ని అంటుతోందన్నారు. జాతీయ స్థాయిలో సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రా, రాష్ట్రంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచేశారని ఆరోపించారు.
వ్యవసాయాన్ని పండుగ చేస్తామని దానిని ఏమాత్రం పట్టించుకోలేదని వివరించారు. దివంగత వైయస్ తమ వారికి దోచిపెట్టడమే విశ్వసనీయతగా ప్రచారం చేశారని ఆరోపించారు. అనేక కష్టాల్లో కూరుకుపోయిన ప్రజల కోసం తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే షర్మిల తన అవినీతి అన్న కోసం పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
వైయస్ తన పాలనలో రాష్ట్రాన్ని స్కాముల రాష్ట్రంగా మార్చారని, వాటి ఫలితమే అనేకమంది అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు జైలుపాలయ్యారన్నారు. మరింత దోచుకునేందుకు షర్మిల పాదయాత్ర చేస్తున్నారన్నారు. వాద్రా అవినీతిపై జగన్ పార్టీ నేతలు నోరు తెరవదని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, అసెంబ్లీ స్పీకర్ వంటి ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేస్తారని, సమస్య వస్తే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తారని ఎవరిది కుమ్మక్కు రాజకీయమో అందరికీ తెలుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications