రోహిత్ ఈగోను టచ్ చేసినా.. హర్ట్ అయినా పుట్టేది సునామీనే.. !!
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ కు పరాజయం తప్పలేదు. చివరి వరకూ పోరాడినా కూడా ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. 27 పరుగుల తేడాతో అపజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా 350కి పైగా పరుగులు చేయడం, రెండు సెంచరీల కలిపి భారీ స్కోర్లు నమోదు కావడం మ్యాచ్ తీవ్రతకు అద్దం పట్టింది.
లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ పరుగుల వరదతో పారింది. రికార్డుల వేట సాగింది. బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. దీంతో లార్డ్స్ ఖిల్లాలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా చివరి వరకు పోరాడింది గానీ దాన్ని గెలుపుగా మలచుకోలేకపోయింది. 360 పరుగులకు పరిమితమైంది. రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.

110 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, ఏడు మెరుపు బౌండరీలతో 138 పరుగులు బాదాడు హిట్ మ్యాన్. లాఫ్డెడ్, హుక్, లాంగ్, స్వీప్, కవర్ డ్రైవ్.. ఇలా దాదాపు అన్ని షాట్లతో రెచ్చిపోయాడు. ఈ సెంచరీతో రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుని ఐకాన్‌గా నిలిచాడు. లార్డ్స్ లో వన్డే సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్.. రోహిత్ శర్మే. ఇప్పటిదాకా ఎవరూ కూడా దీన్ని అందుకోలేకపోయారు.
2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగులే ఇక్కడి రికార్డు. దీన్ని బద్దలు కొట్టాడు. అక్కడితో ఆగలేదు. 39 సంవత్సరాల 80 రోజుల వయసులో ఈ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు కూడా రోహితే. ఈ విషయంలో రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డును చెరిపివేశాడు.
లార్డ్స్‌లో వన్డే శతకం బాదిన అత్యంత వయస్కుడైన భారతీయ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అలాగే.. విదేశీ గడ్డపై అత్యధికంగా ఎనిమిది వన్డే సెంచరీలు చేసిన ఘనత కూడా రోహిత్ దక్కించుకున్నాడు. ఛేజింగ్ లో రోహిత్ శర్మకు ఇది 18వ వన్డే సెంచరీ కూడా. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సెకెండ్ ఇన్నింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రెండో స్థానానికి ఎగబాకాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు.
విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ సాధించిన 21వ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అత్యుత్తమ వన్డే జోడీల జాబితాలో చేరాడు. వీరి కంటే ముందు గంగూలీ-సచిన్ ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ రన్ మిషన్ జో రూట్ సైతం రికార్డుల ఖాతా తెరిచాడు. ఈ సిరీస్‌లో రూట్ అజేయుడిగా నిలిచాడు. ఒక్క మ్యాచ్ లో కూడా అవుట్ కాలేదు. నాటౌట్ గా ఉంటూ 249 పరుగులు చేశాడు. ఫలితంగా ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన జోస్ బట్లర్ రికార్డును రూట్ దాటేశాడు.
వరుసగా ఆరు వన్డే ఇన్నింగ్స్‌లలో 50 పైగా పరుగులు సాధించిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా నిలిచాడు రూట్. తన చివరి నాలుగు వన్డేల్లో రూట్ ఏకంగా 360 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల స్కోర్లు కలిపి లార్డ్స్ లో అత్యధికంగా 747 పరుగులు నమోదయ్యాయి. లార్డ్స్ లో ఇప్పటివరకు 72 వన్డేలు జరగ్గా.. ఈ స్థాయిలో పరుగులు నమోదైంది ఈ ఒక్కదాంట్లోనే. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ 141 పరుగులు చేయడం వల్ల లార్డ్స్ మైదానంలో ఐకానిక్ వివ్ రిచర్డ్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా కనుమరుగైంది.












Click it and Unblock the Notifications