షర్మిల పాదయాత్ర: తెలంగాణపై పెదవి విప్పిన జగన్

తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణపై తమ వైఖరి చెప్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా ఈ ప్రాంతంలో తమ పార్టీ 30 - 40 సీట్లు గెలుస్తుందని ఆయన పార్టీ నాయకులతో అన్నట్లు సమాచారం.
షర్మిల పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోందని, షర్మిల యాత్రకు తెలంగాణలో కూడా ఆదరణ లభిస్తుందని జగన్ అన్నారు. తాను ఏదో ఒక రోజు జైలు నుంచి విడుదలవుతానని ఆయన పార్టీ నాయకుల వద్ద దీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే పది, పదిహేను రోజుల్లో షర్మిల పాదయాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఆమె పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూసుకోవడానికి పార్టీ నాయకుల ద్వారా జగన్ తెలంగాణపై తన వైఖరిని వెల్లడించినట్లు భావిస్తున్నారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని తెలంగాణ జెఎసి చంద్రబాబును, షర్మిలను డిమాండ్ చేసింది. చంద్రబాబు పాదయాత్రను తెలంగాణలో తొలి రోజు అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. షర్మిలకు కూడా అటువంటి ఆటంకమే ఎదురు కావచ్చునని భావిస్తున్నారు. షర్మిల కూడా మహబూబ్‌నగర్ జిల్లా ద్వారానే తెలంగాణలో ప్రవేశిస్తారు.
తెలంగాణపై జగన్ వైఖరిని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసులో చేరిన జిట్టా బాలకృష్ణా రెడ్డి ధ్రువీకరించారు. ఆయన శుక్రవారం జైలులో జగన్‌ను కలిశారు. తెలంగాణ వచ్చినా రెండు ప్రాంతాల్లో పార్టీ ఉంటుందని జగన్ చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు. పార్టీ ప్లీనరీలో తెలంగాణపై చెప్పిన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు జగన్ అన్నట్లు జిట్టా తెలిపారు. ఎవరికీ నష్టం లేకుండా తెలంగాణ సమస్యను కేంద్ర పరిష్కరించాలని జగన్ అన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications