హస్తం దెబ్బ: వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ టార్గెట్ కాంగ్రెసు

K Chandrasekhar Rao
కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకుంటూ కార్యాచరణను రూపొందించనున్నారు. కాంగ్రెసు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటి వరకు కెసిఆర్‌పై విమర్శ ఉంది. నిజానికి, కాంగ్రెసుకు అనుకూలంగానే ఆయన కార్యాచరణ సాగుతూ వచ్చింది. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే అతి విశ్వాసంతో ఉన్నట్లు ఆయనపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినా, కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ముందుకు రాకపోవడంతో ఆయన తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకునే దిశగా ఆయన కరీంనగర్ మేధోమథన సదస్సులో రూపొందించే కార్యాచరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు చర్చల పేరుతో జాప్యం చేయడం వల్ల, కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందనే ప్రచారం వల్ల పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దాన్ని నివారించే దిశగా ఆయన అడుగులు ఉంటాయని అంటున్నారు. ఇంతకాలం ఆయన తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు కాంగ్రెసును లక్ష్యంగా చేసుకోక తప్పదనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

కెసిఆర్ వైఖరి వల్ల తెలంగాణలోని ఒక సామాజిక వర్గం నేతలు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కూడా కళ్లెం వేయాల్సిన పరిస్థితిలో కెసిఆర్ పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ ఉద్యమం తన చేతుల నుంచి జారిపోయే ప్రమాదం ఉందని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తనకు వ్యతిరేకంగా బిజెపి దూకుడుగా అడుగులు ముందుకు వేస్తోంది. సిపిఐ కూడా కెసిఆర్ వైఖరిని తప్పు పడుతోంది.

తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార కాంగ్రెసు పార్టీని కాకుండా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశాన్ని కెసిఆర్ లక్ష్యం చేసుకోవడాన్ని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ వ్యతిరేకించారు. తెలంగాణలో తెలంగాణవాదం పేరుతో సిపిఐ, బిజెపి తనకు చెక్ పెట్టేందుకు ముందుకు వస్తుంటే, సామాజిక వర్గ సమీకరణాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెరాసను దెబ్బ తీసే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇదంతా కెసిఆర్ కాంగ్రెసు అనుకూల వైఖరి వల్లనే జరుగుతోందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెసును ప్రధాన శత్రువుగా పరిగణిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం ఏ మాత్రం సుముఖంగా లేదనే విషయం తేలిపోయిందని కూడా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, మేధోమథన సదస్సులో మొదటి రోజు బుధవారం కాంగ్రెసును నమ్మొద్దంటూ పిలుపునివ్వడమే కాకుండా కాంగ్రెసు పార్టీ డేంజర్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను బట్టి ఆయన కాంగ్రెసు అధిష్టానం చేతిలో తాను దెబ్బ తిన్నాననే భావనకు ఆయన గురైనట్లు చెబుతున్నారు. అందుకే, కాంగ్రెసును దెబ్బ తీసే వ్యూహంతో రాజకీయ వ్యూహాలను రూపొందించి అమలు చేయాలని ఆయన అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+