నిర్మలమ్మ హామీ! మూజువాణి ఓటుతో కీలక బిల్లుకు ఆమోదం
డిజిటల్ లావాదేవీలకు సంబంధించి దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. 'ట్యాక్సేషన్ అండ్ ఇతర చట్టాల(సవరణ) బిల్లు-2026' కు పార్లమెంట్ సోమవారం తన తుది ఆమోద ముద్ర వేసింది. లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ ద్రవ్య బిల్లును రాజ్యసభ సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందిందగా ప్రక్రియ పూర్తయింది. ఈ బిల్లు సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. యూపీఐ వినియోగదారులకు చిన్న వ్యాపారులకు భారీ ఊరటనిచ్చే స్పష్టతనిచ్చారు.
రూపాయి కూడా ఛార్జీ పడదు!
రాజ్యసభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి, యూపీఐ డిజిటల్ పేమెంట్లపై ఎటువంటి లావాదేవీల ఛార్జీలు, పన్నులు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. కొత్తగా తెచ్చిన చట్టపరమైన నిబంధనలు కేవలం ముందస్తు సదుపాయం కోసమే తప్ప, సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడానికి కాదని వెల్లడించారు.

ప్రభుత్వం నుంచి ముందస్తు మినహాయింపులు పొందే డిజిటల్ చెల్లింపుల విధానాలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకే ఈ మార్పులు చేశామని తెలిపారు. చిన్న వ్యాపారులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, వారిపై ఛార్జీలు మోపే ఉద్దేశం ఏమాత్రం లేదని పునరుద్ఘాటించారు.
పెట్టుబడులు, ఉద్యోగాల వేటలో కొత్త సంస్కరణలు
వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కొత్త బిల్లును రూపొందించారు. ముఖ్యంగా దేశీయంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు, డైమండ్ వ్యాపార రంగానికి భారీగా పన్ను మినహాయింపులు ప్రకటించారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పలు నిబంధనలను సరళీకృతం చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయాల వల్ల భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే కొన్ని రకాల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు, అంతర్జాతీయ సెటిల్మెంట్ బ్యాంక్‌కు వచ్చే రాబడిపై పన్ను మినహాయింపులు కల్పిస్తూ బిల్లులో నిబంధనలు చేర్చారు. అలాగే రఫ్ డైమండ్స్ వ్యాపారం, బిజినెస్ ట్రస్టులకు సంబంధించిన విధానాల్లో పారదర్శకత పెంచేలా మార్పులు చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇది మనీ బిల్లు కావడంతో రాజ్యసభ చేసిన సూచనలను లోక్‌సభ పరిశీలించిన అనంతరం బిల్లు పూర్తి స్థాయిలో చట్టంగా మారనుంది.




Click it and Unblock the Notifications