నన్ను మూర్ఖుడ్ని చేశారు: అధిష్టానంపై యెడ్డీ

తనను పార్టీలో ఉంచుకోవడానికి ప్రయత్నించవద్దని ఆయన బిజెపి జాతీయ నాయకులకు సూచించారు. తాను పార్టీని వదిలేశానని, పార్టీ పగ్గాలు కెఎస్ ఈశ్వరప్ప, హెచ్ఎన్ అనంత కుమార్ చేతుల్లో ఉన్నాయని, తాను తన సొంత పార్టీని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నానని ఆయన అన్నారు. తన లేకుండా బిజెపి మనుగడ సాధ్యం కాదనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
రాజకీయ జీవితంలో తాను రెండు తప్పులు చేశానని ఆయన చెప్పారు. లోకాయుక్త తనను తప్పుపట్టడంపై ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని జాతీయ నాయకత్వం సూచించినప్పుడు శాసనసభను రద్దు చేయకపోవడం ఒక తప్పు కాగా, మేలో జరిగిన హుబ్లీ సదస్సు సందర్భంగా పార్టీ నుంచి తప్పుకోకపోవడం రెండో తప్పిదమని ఆయన అన్నారు.
హుబ్లీ సదస్సు సందర్భంగా తాను పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డానని, అయితే ఆలా చేయవద్దని తనకు కొంత మంది సూచించారని, మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని తనకు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. అయినా, లోకాయుక్త నివేదికపై తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోకుండా శాసనసభను రద్దు చేయాల్సి ఉండిందని ఆయన అన్నారు.
బిజెపి ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదు
కర్నాటకలో బిజెపి ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తనకు తెలియదని యడ్డీ కర్నూలు జిల్లాలో అన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాఘవేంద్రుడి దయతో మళ్లీ సిఎం అవుతానని, ఏ జాతీయ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోమని అన్నారు.












Click it and Unblock the Notifications