'ఎమ్మెల్సీ' స్వామి గౌడ్: నారదాసుకు కరీంనగర్ టిక్కెట్?

స్వామి గౌడ్‌ను పార్టీలోకి తీసుకునేందుకు కెసిఆర్ ఆయన విజ్ఞప్తిని కూడా మన్నించారట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చేవెళ్ల టిక్కెట్ ఇస్తానని చెప్పారట. పార్టీలో వెంటనే జాయిన్ కావాలని చెప్పారట. మొదట ఏ పార్టీలో చేరవద్దని భావించిన స్వామి గౌడ్ కెసిఆర్ ఒత్తిడి తేవడంతోనే తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారట. అంతేకాకుండా తాను కోరిన చేవెళ్ల టిక్కెట్ కూడా ఇస్తామని చెప్పడంతో మార్గం సుగమం అయిందంటున్నారు.
అయితే చివరి నిమిషంలో ఆయనను ప్రస్తుతానికి శాసనమండలికి పంపించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ రోజు స్వామి గౌడ్ పార్టీలో చేరే సమయంలో కెసిఆర్ అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నారదాసు లక్ష్మణ రావు ఉన్నారు. ఆయన పదవి కాలం ఫిబ్రవరితో ముగియనుంది. ఆ తర్వాత ఆ దానిని స్వామి గౌడ్‌కు ఇవ్వనున్నారు.
నారదాసుకు మరో అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ టిక్కెట్ ఇస్తామని ఆయనకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకు నారదాసు కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే శాసనమండలికి వెళ్లే స్వామి గౌడ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చేవెళ్ల నుండి పోటీ చేసేందుకు మాత్రం ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications