మద్దతిస్తారా: అవిశ్వాసంపై బాబుకు షర్మిల సవాల్

కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల ఎమ్మిగనూరు నియోజకవర్గం కె. తిమ్మాపురం బహిరంగ సభలో శనివారం ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని ఆమె అన్నారు. చంద్రబాబుకు మాత్రం ప్రభుత్వంపై విశ్వాసం ఉందని ఆమె వ్యంగ్యంగా అన్నారు.
చంద్రబాబుపై షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును చంద్రబాబు ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారని చెప్పారు. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకమని, దానికి విద్యుత్తు, మోటార్లు కావాలని ఆమె అన్నారు. విద్యుత్తును, మోటార్లను సమకూర్చడానికి ప్రభుత్వానికి మూడేళ్లు కూడా సరిపోలేదని ఆమె దుయ్యబట్టారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీరుస్తారని ఆమె హామీ ఇ్చారు.
ఎమ్మిగనూరులోని గణేష్ రైసు మిల్లు నుంచి ఆమె శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఆమె పాదయాత్ర శనివారంనాడు 31వ రోజుకు చేరుకుంది. ఆమె శనివారం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. రాత్రికి కోడుమూరు నియోజకవర్గంలో బస చేస్తారు.












Click it and Unblock the Notifications