హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ధోరణే చంద్రబాబు, షర్మిలలకు అడ్వాంటేజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Sharmila-Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ధోరణే ప్రతిపక్ష నేతలు నారా చంద్రబాబునాయుడు, షర్మిలలకు అడ్వాంటేజ్‌గా మారిందనే మాట వినిపిస్తోంది. కెసిఆర్ కాంగ్రెసు అనుకూల వైఖరిని వారు అవకాశంగా తీసుకుని తెలంగాణలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా పర్యటించగలుగుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర ముగించి, మెదక్ జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆయన నిజామాబాద్ జిల్లాలోకి అడుగు పెట్టనున్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం తెలంగాణలో అడుగుపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ప్రజలు పెద్ద యెత్తున ఆమెను చూడడానికి తరలి వచ్చారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిష్ర్రియను, కెసిఆర్ వైఖరిని అవకాశంగా తీసుకుని షర్మిల, చంద్రబాబు తెలంగాణ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ కాంగ్రెసును ఇప్పటి వరకు పెద్దగా నిలదీయకపోవడం వల్ల వారికి తగిన అవకాశం లభించిందని అంటున్నారు.

కెసిఆర్ నిజంగానే ఇంతకాలం కాంగ్రెసు అధిష్టానాన్ని విశ్వసిస్తూ వచ్చారని అనుకోవచ్చు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశిస్తూ వచ్చారు. అలా ఆశిస్తూ ఆయన కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేయడానికి వెనకాడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకున్నంతగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని చేసుకోలేదు. ఆ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకున్న కెసిఆర్ కాంగ్రెసు పార్టీ పట్ల మెతకవైఖరి ప్రదర్శిస్తూ వచ్చారని అంటారు.

నిజానికి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే కాకుండా కాంగ్రెసు పార్టీ కూడా తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ పార్టీలు వైఖరిని స్పష్టం చేయకపోవడం వల్లనే తెలంగాణపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటూ వస్తోంది. ఆ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేస్తేనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పి. చిదంబరం చెప్పారు. తెలంగాణ అంశం వేడెక్కిన ప్రతిసారీ కాంగ్రెసు అధిష్టానం సంప్రదింపులను ముందుకు తీసుకుని వస్తోంది.

అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీని వదిలేసి తమను లక్ష్యం చేసుకోవడమేమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు కెసిఆర్‌ను అడుగుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెసుపై కెసిఆర్ దూకుడు ప్రదర్శించడం లేదనే వాదన ఉంది. దాంతో తెలంగాణపై అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుందని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకులు అంటున్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబుతో పాటు వైయస్ విజయమ్మ కూడా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం పెట్టి ఆ రెండు పార్టీలు తప్పించుకుంటున్నాయనేది వాస్తవం.

కానీ, తెలంగాణ ఉద్యమ పార్టీగా తెరాస కాంగ్రెసు పార్టీని అంతగా లక్ష్యం చేసుకోవడం లేదనేది కూడా నిజమని అంటున్నారు. అందుకే, తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తాను తెలంగాణను వ్యతిరేకించలేదని, వ్యతిరేకించబోనని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఓ అడుగు ముందుకు వేసి అణు ఒప్పందం బిల్లును ఆమోదింపజేసుకున్న కాంగ్రెసు పార్టీ తెలంగాణ బిల్లును ఎందుకు పార్లమెంటు బిల్లును ప్రతిపాదించలేదని అడిగారు.

ఇక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణ ప్రజల సెంటిమెంటును సంపూర్ణంగా గౌరవిస్తున్నామంటూ సమస్యను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పి తప్పుకున్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చిన షర్మిల తెలంగాణను బతికించుకుందామని చెప్పారే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆహ్వానిస్తారా, లేదా అనే విషయాన్ని తేల్చలేదు. నిజానికి, కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేస్తేనే మిగతా రెండు పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది. అంత వరకు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రస్తుత వైఖరులతోనే ముందుకు సాగడానికి అవకాశం ఉంది.

కాంగ్రెసు స్పష్టమైన వైఖరి చెప్తే కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైఖరుల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెసు నిర్ణయం తీసుకోనంత వరకు కేంద్ర ప్రభుత్వం సమస్యను ఇలాగే నానుస్తూ ఉంటుంది. రాజకీయపరమైన లాభనష్టాలను బేరీజు వేసుకుని అది నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లడానికి షర్మిల, చంద్రబాబు ఓ కచ్చితమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కానీ, కాంగ్రెసుకు ఆ వ్యూహాన్ని అవకాశం లేకుండా పోయింది. అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెసుకు ఆ ఇబ్బంది ఉంటుంది.

English summary
According to political analysts - Telugudesam party president N Chandrababu Naidu and YSR Congress president YS Jagan's sister Sharmila are taking advantage of Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao's soft approach towards Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X