ఎమ్మెల్యే నుండి కేంద్రమంత్రి: రఘువీరాకు జెసి ఝలక్

JC Diwakar Reddy-Raghuveera Reddy
అనంతపురం: జిల్లాకు చెందిన మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విషయం తెలిసిందే. వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. కొంత కాలం క్రితం జిల్లాలో జెసి బ్రదర్స్ హవా కొనసాగింది. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వారి హవా కాస్త తగ్గి ప్రత్యర్థి వర్గం పుంజుకుంటోంది. అందులో రఘువీరా ప్రధానమైన వారు. జిల్లా కాంగ్రెసు ముఖ్య నేతలు అంతా రఘువీరాకు మద్దతుగా నిలబడతారు.

కానీ జెసి వర్గం మాత్రం జిల్లా కాంగ్రెసులో ఒంటరి పోరు చేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేసినప్పుడు జెసికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది రఘువీరానే అనే వాదన ఉంది. రఘువీరాతో పాటు జిల్లాకు చెందిన పలువురు సొంత పార్టీ ప్రజాప్రతినిధులు కూడా జెసికి వ్యతిరేకంగా అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారట. అందుకే ఆయనకు రావాల్సిన మంత్రి పదవి తృటిలో చేజారిపోయిందంటారు.

అలాంటి జెసి దివాకర్ రెడ్డి వర్గం మంత్రి రఘువీరా రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హంద్రీనీవా 'భగీరథ విజయ యాత్ర'కు వస్తుందని ఎవరూ భావించరు. అయితే రఘువీరా... జెసి సోదరులను తన యాత్రకు ఆహ్వానించారా లేదా ఒకవేళ ఆహ్వానిస్తే వారే రాలేదా అనే చర్చ జరుగుతోంది. అందర్నీ ఆహ్వానించి జెసి సోదరులను ఆహ్వానించలేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏది ఏమైనా రఘువీరా యాత్ర... జెసి గైర్హాజరీపై జిల్లాలో, పార్టీలో చర్చ జరుగుతోంది.

భగీరథ విజయ యాత్రకు జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల నుండి కేంద్రమంత్రి స్థాయి వరకు పలువురు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రులు చిరంజీవి, పల్లం రాజు, పురంధేశ్వరి, దివంగత వైయస్ ఆత్మ బంధువు కెవిపి రామచంద్ర రావు పాల్గొన్నారు. డికె అరుణ్, బలరాం నాయక్ వంటి తెలంగాణ నేతలు సైతం పాల్గొన్నారు. అంతేకాకుండా హంద్రీనీవాతో అనంతపురం జిల్లాకు లబ్ధి చేకూరుతుంది. రేపు రఘవీరా రెడ్డి పాదయాత్ర పూర్తవుతుంది.

ఇందు కోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. సిఎం, పిసిసి చీఫ్‌లు వస్తున్నప్పటికీ జెసి, ఆయన వర్గం మాత్రం గైర్హాజరయ్యేందుకే నిర్ణయించుకుంది. రఘువీరా యాత్రను జెసి, ఆయన వర్గం ఏమాత్రం పట్టించుకోకుండా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. అయితే హంద్రీనీవా నీటిని తాడిపత్రికి కేటాయించాలని జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాయటం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+