భయంతో సభ పెట్టాడు, జిల్లాకు వంద: కెసిఆర్‌పై సురేఖ

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన, ఆ కుటుంబం పైన ప్రజలకు ఎంత అభిమానం ఉందో తెరాస నేతలకు తెలియదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెడితే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బయటకు వచ్చారని, తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర చేస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ ఎంపిగా ఉన్న కెసిఆర్‌కు ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాలమూరులో పళ్లు రాలగొడితే.. పరకాలలో చావుతప్పి కన్నులొట్టబోయిందన్నారు.
షర్మిల యాత్రకు వస్తున్న ఆదరణ చూసి తెరాస నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో జిట్టా బాలకృష్మా రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావులు తమ పార్టీలో చేరితే కెసిఆర్‌కు సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, వచ్చే రోజుల్లో తెరాస ఒక్కో జిల్లాలో వందకంటే ఎక్కువ సభలే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైయస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన కెసిఆర్‌కు అవి పలికేందుకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు.
పన్నెండేళ్లుగా ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారన్నారు. అమెరికా నుండి కొడుకు, కూతురును పిలిపించుకొని పోస్టులు అప్పజెప్పితే తప్పులేనిది విజయమ్మ, షర్మిల బయటకు వస్తే తప్పా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది పార్టీ విలీనం కోసం కాదని ప్యాకేజీలు మాట్లాడుకునేందుకేనని ఆరోపించారు. తెలంగాణ ఎలా తెస్తావో చెప్పగలవా అని ప్రశ్నించారు. టిడిపి, కాంగ్రెసుల పైనా ఆమె విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications