ప్లాన్ క్రెడిట్ నాదే: డిఎల్, బొత్స కౌంటర్, చిరంజీవికీ..

తాను నిరుడు ఫిబ్రవరిలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖ వల్లనే సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించారని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తన లేఖ వల్లనే దాన్ని జాతీయ సలహా మండలి అంశాల్లో చేర్చారని, దానిపై కసరత్తు జరిగిన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు దూరమవుతున్న దళితులను, గిరిజనులను తిరిగి రాబట్టుకునేందుకు ఆ సబ్ ప్లాన్ గురించి తాను లేఖలో రాశానని ఆయన చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ముఖ్యమంత్రి చొరవతో రాలేదని ఆయన అన్నారు. రచ్చబండ, ఇందిరమ్మ బాటల్లో వచ్చిన సూచనలతోనే సబ్ ప్లాన్‌ను రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పుకోవడంలో నిజం లేదని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని దాన్ని మంత్రివర్గానికి రుద్దారని ఆయన అన్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని ముఖ్యమంత్రే అన్నారని ఆయన గుర్తు చేశారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై గవర్నర్ తీసుకునే నిర్ణయంపై పరిణామాలు ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ క్రెడిట్ ఏ ఒక్కరి ఘనతో కాదని, కాంగ్రెసు పార్టీ ఛాంపియన్ అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు పార్టీ అధిష్టానం అద్భుతమైన అవకాశం ఇచ్చిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సబ్ ప్లాన్‌పై మాట్లాడాల్సిన సమాచారాన్ని ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు ఇచ్చారు.
సోనియా గాంధీ సూచన మేరకే రాష్ట్రంలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారంపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, మంత్రివర్గ నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసే హక్కు మంత్రులకు ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications