సోనియా బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి తీసుకున్నారు: కిషన్ రెడ్డి

ఇందిరాపార్కు వద్ద కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్షం పేరుతో కేంద్రం కొత్త నాటకం ఆడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయుధాన్ని బిజెపికి ఇస్తే తెలంగాణ ఇచ్చే బాధ్యత తమ పార్టీదే అని హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న సోనియా తెలంగాణను కానుకగా ఇచ్చి వెనక్కి తీసుకుందని, ఇది చాలా దుర్మార్గం అన్నారు. పుట్టిన రోజును వెనక్కి తీసుకున్న ఘనత ఆమెదే అన్నారు.
అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెసు పార్టీ నుండి సోనియా గాంధీ రావాలన్నారు. ఆమె వస్తే తమ పార్టీ తరఫున నితిన్ గడ్కరీ వస్తారన్నారు. తెలుగు మహాసభల కారణంతో అఖిల పక్షం తేదీని వాయిదా వేయవద్దన్నారు. అవసరమైతే ముందే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల పక్షంలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పాల్సిందేనని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
యూపిఏ దిష్టి బొమ్మ దగ్ధం
తెలంగాణ గురించి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఏమీ తెలియదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న చేసిన ప్రకటన అమలు చేయనందుకు సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నారాయణగూడలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. సిపిఐ యూపిఏ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.
షిండేకు తెలంగాణ గురించి తెలియదన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అధిష్టానం మాట వినడం ఆపాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు వారి దిష్టి బొమ్మలు తగులబెట్టాల్సి వస్తుందన్నారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణపై మోసం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications