హెటెరోలో పేలుడు, ఇద్దరి మృతి: కిరణ్ పరామర్శ

కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం తూర్పు గోదావరి జిల్లా పర్యటన కోసం విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు. హెటెరో పేలుడు జరగడంతో ఆయన మొదట ఎబిసి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి జైరామ్ రమేష్, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా బాధితులను పరామర్శించారు. బాధితులన అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.
కాగా హెటిరో డ్రగ్స్‌లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలోని సీ బ్లాక్‌లో రియాక్టర్.. అధిక పీడనం కారణంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి బ్లాక్‌లోని గోడలు రేకులతో సహా లేచి పడ్డాయి. అక్కడ విధుల్లో ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కంపెనీ ప్రత్యేక అంబులెన్సులో విశాఖపట్నం కెజిహెచ్‌కి తరలించారు.
పేలుడు శబ్దం విన్నవెంటనే అక్కడ పనిచేస్తున్న మిగతా కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా అంతా బయటకు వచ్చేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు.. రియాక్టర్లో ఉన్న రసాయనాలు బయటకు వెలువడడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నిపుణుల సూచన మేరకు బ్లాక్‌లోకి వెళ్లరాదని యాజమాన్యం ప్రకటించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం బాధాకరమని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి యాజమాన్యం, ప్రభుత్వం మెరుగైన వైద్యసహాయం అందించి వారు త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మృతుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కంపెనీని ప్రస్తుతానికి మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications