తెలంగాణపై జగన్ పార్టీ ఆదేశం: గుర్నాథ్‌కు అక్షింతలు

దీంతో స్పందించిన పార్టీ అధిష్టానం గుర్నాథ్ రెడ్డికి అక్షింతలు వేసింది. సున్నితమైన తెలంగాణ అంశంపై ఏమీ మాట్లాడవద్దని అతనికి సూచించింది. పార్టీలో ఉన్నప్పుడు ఎవరూ సొంత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పవద్దని ఆదేశించింది. పార్టీ వేదిక పైన అభిప్రాయాలు చెప్పుకోవాలని సూచించింది. తెలంగాణపై పార్టీ విధానం ఇప్పటికే స్పష్టం చేసిందని, అలాంటప్పుడు ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు ఎవరూ కూడా మీడియా ముందు ఈ అంశంపై మాట్లాడవద్దని సూచించింది.
కాగా ఈ రోజు ఉదయం జగన్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తానన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే ప్రత్యేక సీమ కావాల్సిందే అన్నారు. విభజన జరగకుండా ఉండటానికి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణపై పార్టీ అభిప్రాయం, తన అభిప్రాయం వేరన్నారు. మంత్రి గంటా స్రీనివాస రావు సమైక్యాంధ్ర సమావేశానికి ఆహ్వానిస్తే తాను వెళ్తానని చెప్పారు.
కొందరు స్వార్థపూరిత నేతలు తెలంగాణ వచ్చిందని, తీసేసుకున్నామన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడటం కాదన్నారు. కేంద్రం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంత సులభం కాదన్నారు. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తాను వ్యక్తిగతంగా విభజనకు ఒప్పుకోనని గుర్నాథ్ రెడ్డి చెప్పారు. దీనిపై పార్టీ ఆయనకు అక్షింతలు వేసింది.












Click it and Unblock the Notifications