గౌరీకుండ్ వద్ద భారీ అడ్డంకి: కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న కుంభవృష్టి కారణంగా ప్రముఖ శైవక్షేత్రం కేదార్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. భారీ వర్షాల వల్ల గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వెళ్లే ప్రధాన నడక మార్గంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రుద్రప్రయాగ జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ ఉదయం ఆదేశాలు జారీ చేశారు.
హిమాలయ పర్వతాలపై నుంచి నిరంతరాయంగా బురదతో కూడిన శిధిలాలు, పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకువస్తుండటంతో రోడ్డు మొత్తం దెబ్బతింది. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ఈ ఉదయం నుంచే భక్తుల ప్రయాణాలను యంత్రాంగం పూర్తిగా నిలిపివేసింది. కేదార్‌నాథ్ దర్శనానికి తరలివచ్చిన వేలాది మంది యాత్రికులను మరింత ముందుకు సాగనివ్వకుండా గౌరీకుండ్, సోన్‌ప్రయాగ్ పరిసరాల్లో ఆశ్రయాల వద్ద ఆపివేశారు. వారికి అవసరమైన రక్షణ కల్పిస్తున్నారు.

ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల ధాటికి కాలినడక మార్గమే కాకుండా సోన్‌ప్రయాగ్- గౌరీకుండ్ మధ్య ఉండే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడి రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే స్థానిక షటిల్ సర్వీసులు ఆగిపోయాయి. దీనివల్ల అటు కాలినడకన వెళ్లేవారికి, ఇటు వాహనాలలో వెళ్లే యాత్రికులకు తీవ్ర అంతరాయం కలిగి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ విపత్కర పరిస్థితులలో సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక జిల్లా పరిపాలన విభాగం, ఉత్తరాఖండ్ పోలీసులు, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. దెబ్బతిన్న కొండ దారుల వద్ద రక్షణ గోడలను నిర్మించడం, రోడ్డుపై పేరుకుపోయిన బండరాళ్లను తొలగించి మార్గాన్ని అనువుగా మార్చే పనులను అధికారులు చేపట్టారు. వాతావరణం కాస్త అనుకూలించిన వెంటనే నడక దారిని పునర్నిర్మించేందుకు శ్రమిస్తున్నారు.
ఈ పరిస్థితిపై రుద్రప్రయాగ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రజ్వార్ మాట్లాడారు. కేదార్‌నాథ్ యాత్ర పునరుద్ధరణ అనేది పూర్తిగా ఇక్కడి వాతావరణం అనుకూలించడంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కొండ దారి మొత్తం క్లియర్ అయి, ప్రయాణం సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తరువాతే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ ప్రస్తుతం అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని విపత్తు నిర్వహణ బృందాలు విజ్ఞప్తి చేశాయి.














Click it and Unblock the Notifications