ఇక వీరికీ రూ 500కే వంట గ్యాస్, ప్రభుత్వం తాజా నిర్ణయం- మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం మరింత విస్తరించాలని డిసైడ్ అయింది. ఆరు గ్యారంటీల అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం.. కొత్త లబ్ది దారుల విషయంలోనూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందులో భాగంగా కొత్తగా 5 లక్షల మంది కి రూ 500 కే వంట గ్యాస్ పథకం అమలు చేసేందుకు సమాయాత్తం అయింది. లబ్ది దారుల ఎంపిక పైనా ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో.. ఈ పథకం అమలుతో పెద్ద సంఖ్యలో పేదలకు లబ్ది కలగనుంది.
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని మరో అయిదు లక్షల మందికి అందే విధంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. తాజాగా మరో 5 లక్షల పైచిలుకు కుటుంబాలను ఈ పథకానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. అర్హుల జాబితాను సైతం గుర్తించిన అధికారులు.. తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి, నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ వంట గ్యాస్ పథకం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకం కోసం మొత్తం 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 42.90 లక్షల మందికి ప్రస్తుతం పథకం అమలు చేస్తున్నారు.

తుది కసరత్తు.. త్వరలో అమలు
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ పథకం కోసం రూ.723.30 కోట్లు కేటాయిస్తోంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో.. గత రెండేళ్ల కాలం లో ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేసింది. దీని ద్వారా లబ్దిదారులు ఈ పథకం కోసం భారీగా దరఖాస్తు చేసారు. గతంలో వివాహం చేసుకొని కొత్తగా కాపురం పెట్టిన జంటలకు వేరుగా రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నా ఒకే కార్డు ఉండటం వంటి కారణాలతో చాలామంది అర్హులు పథకానికి దూరమయ్యారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన పౌరసరఫరాల శాఖ, 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా నిర్ధారించింది. త్వరలోనే వీరికి పథకం అమలు పైన నిర్ణయం ప్రకటించనున్నారు. తద్వారా వీరి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కానుంది.



Click it and Unblock the Notifications