అమ్మాయి మోజులో దేశ రక్షణ రహస్యాలు లీక్! హనీట్రాప్‌లో చిక్కిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్
మామూలు మనిషి స్త్రీ ఆకర్షణకు లోనైతే కొంప మునుగుతుంది, అదే దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారి పొరపాటు చేస్తే ఏకంగా దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. సరిగ్గా ఇదే జరిగింది. భారత వాయుసేనలో అత్యున్నత హోదాలో పనిచేస్తున్న ఓ వింగ్ కమాండర్ ఓ అందమైన అమ్మాయి పరిచయానికి పడిపోయి, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని శత్రు దేశం చేతిలో పెట్టాడు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందుల్లో ఉన్న సదరు అధికారిని లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియా వేదికగా వల విసిరింది ఓ అపరిచిత మహిళ. మాటలతో దగ్గరై, ఆపై వీడియో కాల్స్‌తో మైకంలోకి దించి, తన అసలు రూపాన్ని బయటపెట్టింది.
అందమైన వల... రహస్యాల లీక్
చాటింగ్‌తో మొదలైన వ్యవహారం క్రమంగా వీడియో కాల్స్ దాకా వెళ్లింది. అధికారి నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్న తర్వాత ఆ మహిళ తన అసలు పని ప్రారంభించింది. మన మిలిటరీ బలగాలు ఎక్కడెక్కడ మోహరించాయి? సైనిక వాహనాలు, విమానాల కదలికలు ఎలా ఉన్నాయి? అనే వివరాలతో పాటు రక్షణ రంగానికి చెందిన కీలక ఫొటోలు, వీడియోలను పంపాలంటూ కోరింది. ఆ మహిళ అందానికి లోనైన సదరు వింగ్ కమాండర్, ఏమాత్రం ఆలోచించకుండా డిజిటల్ మార్గాల ద్వారా అత్యంత రహస్య పత్రాలను ఆమెకు చేరవేశాడు.

పాకిస్తాన్ హ్యాండ్లర్ల పక్కా స్కెచ్
విచారణలో తేలిన నిజాలు చూసి పోలీసులే దిగ్భ్రాంతి చెందారు. ఆ అధికారికి ఎర వేసిన మహిళ వెనుక పాకిస్తాన్‌కు చెందిన గూఢచార హ్యాండ్లర్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేవలం సమాచారం తీసుకోవడమే కాకుండా, సదరు అధికారి తోటి సిబ్బంది ఫోన్లలో ఓ ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని కూడా ఆ మహిళ ఆదేశించినట్లు తెలిసింది. అది సాధారణ యాప్ కాదని, అవతలి వ్యక్తి ఫోన్‌లోని సమాచారాన్ని, లొకేషన్‌ను హ్యాక్ చేసి సేకరించే డేంజరస్ 'స్పైవేర్' అని విచారణలో బయటపడింది.
సైబర్ నిఘాలో దొరికిన అధికారి
అయితే, రక్షణ శాఖకు చెందిన నిఘా విభాగానికి ఈ అధికారి ప్రవర్తనపై ముందే అనుమానం వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా ఆయన కదలికలను, ఫోన్ కాల్స్‌ను ఆర్మీ ఇంటెలిజెన్స్ సైలెంట్‌గా గమనిస్తూ వచ్చింది. పక్కా ఆధారాలు దొరకగానే వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. మే 31 అర్ధరాత్రి వేళ రంగంలోకి దిగిన పోలీసులు ఆ వింగ్ కమాండర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కటకటాల వెనక్కి... కోర్టు రిమాండ్
దేశద్రోహానికి సమానమైన ఈ తీవ్ర నేరానికి గానూ సదరు అధికారిపై అధికారిక రహస్యాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన్ను న్యాయస్థానం రిమాండ్‌కు పంపడంతో జైలులోనే ఉన్నాడు. ఈ కుట్ర వెనుక ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉంది? సైన్యానికి చెందిన ఎంతటి కీలక సమాచారం శత్రుదేశం చేతికి వెళ్లింది? దీనివల్ల దేశ భద్రతకు ఎంతవరకు ముప్పు వాటిల్లింది? అనే కోణంలో పోలీసులు, రక్షణ శాఖాధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.




Click it and Unblock the Notifications