చీము నెత్తురుంది, మేమూ కూల్చగలం: కోమటిరెడ్డి ఫైర్

సీమాంధ్ర నేతలు బెదిరించి అడ్డుకున్నారని, తమకు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదా అని ఆయన ప్రశ్నించారు. తమకు చీము, నెత్తురు ఉన్నాయని అన్నారు. తాము ప్రభుత్వాన్ని కూల్చగలమన్నారు. బెదిరించి తెలంగాణను అడ్డుకుంటారా అని ఆయన సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రాకుంటే తమ తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు.
రెండు రోజుల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వస్తుందన్న తరుణంలో సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేసి అడ్డుకోవడం బాధాకరమన్నారు. కెసిఆర్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
కెసిఆర్‌ను కలవడంలో తప్పులేదు
తన సోదరుడు కెసిఆర్‌ను కలవడంలో ఎలాంటి తప్పులేదని ఢిల్లీలో ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటించకుంటే బడ్జెట్ సమావేశాలు జరగనిచ్చేది లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటామన్నారు.
సామాజిక బహిష్కరణ
ఈ నెల 28వ తేదిలోగా తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. లేదంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలే మా టార్గెట్ అన్నారు. వారిని సామాజికంగా బహిష్కరిస్తామన్నారు. జెఏసి సమావేశాలకు కాంగ్రెసు పార్టీ నేతలను పిలిచేది లేదన్నారు.
కేంద్రం తనకు తాను విధించుకున్న 28 డెడ్ లైన్ లోపు ప్రకటన చేయాలన్నారు. లేదంటే ఆ రోజు సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమర దీక్ష, ఆమరణ దీక్షలపై ఎలాంటి ఊహాగానాలు వద్దని సూచించారు. ఏది ఉన్నా ముందే చెబుతామన్నారు. పోలీసులు సమర దీక్షకు అనుమతిని ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications