ఏపీని చుట్టుముట్టిన వడగాల్పులు
ఏపీలో ఎండ తీవ్రత అధికమైంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఈ నెల చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. వేడి గాలుల ప్రభావానికి శరీరంలో నీటి శాతం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఉడికిస్తోంది.

శనివారం వరకు ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడం సాధారణమైంది.
- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
- విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుండి - 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండకాచింది.
- శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, రాయచోటి, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డయింది.
- నేడు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.












Click it and Unblock the Notifications