గాంధీ ఆస్పత్రిలో శంకరరావు: అరెస్టుపై నేతల నిప్పులు

శంకర రావుపై మోసం, ఫోర్జరీ, బెదరింపులు వంటి కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను ముందు నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం ఆయనకు ఆరోగ్యం బాగా లేదంటే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఓ గంట పాటు పరీక్షలు జరిపిన అనంతరం ఆయనను విడిచిపెట్టారు. ఎక్కడకు వెళ్లేదీ ఆయన ఇష్టం అని పోలీసులు చెప్పారు. అరెస్టు తీరుపై శంకరరావు షాక్ తిన్నట్లు కనిపించారు. ఆయన వాంతులు కూడా చేసుకున్నారు.
గురువారం సాయంత్రం పోలీసులు ఆకస్మికంగా శంకరరావు ఇంటికి అరెస్టు చేయడానికి వెళ్లారు. అయితే ఉన్నపళంగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన భార్య, కూతురు ప్రశ్నించారు. గతంలోనే గ్రీన్ ఫీల్డ్స్ కేసులో ఆయన అరెస్టుకు వారంటు జారీ అయి వుందని వారు వివరించారు. ఈ కేసుపై కోర్టులో స్టే ఉందని శంకరరావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందు పోలీసు స్టేషన్‌కు బయలుదేరవలసిందేనని పోలీసులు ఆదేశించారు. అప్పటికి ఆయన లుంగీలో ఉన్నారు. చొక్కా గుండీలు కూడా పెట్టుకోలేదు. ఆయన అలాగే బయలుదేరారు.
హైదరాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్స్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై చాలాకాలంగా అరెస్టు వారంటు పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆనారోగ్యం దృష్ట్యా పోలీసులు శంకరరావు అరెస్టును వాయిదా వేస్తూ వచ్చారు. పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించడానికి ప్రయత్నించారు. పోలీసు స్టేషన్ వద్దకు దళిత సంఘాలు చేరుకుని ఆందోళనకు దిగాయి. నకిలీ పత్రాలతో శంకరరావు మొత్తం 75 ఎకరాలలో 875 ప్లాట్లు వేసి అమ్మేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ శంకరరావు ఈ భూములను అమ్మేసి, వాటిని క్రమబద్ధీకరించడానికి యత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయనపై 420, 120బి, 367, 468, 506 సెక్షన్‌ల క్రింద భయపెడ్డడం, ఫోర్జరీ, అబద్ధాలు, మోసం తదితర కేసులు నమోదు అయ్యాయి.
శంకరరావుపై ఏం కేసులు ఉన్నాయో, వాటి పరిస్థితి ఏమిటో తనకు తెలియదు గాని ఆయనను అరెస్టు చేసిన తీరు మాత్రం ఆక్షేపణీయమని మందకృష్ణ మందిగ తీవ్రంగా విమర్శించారు. కనీసం బట్టలు వేసుకోనివ్వకుండా, తోసుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారని, ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి అయితే ఇలాగే వ్యవహరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. దీనిని దళితుల ఆత్మరక్షణ కోణంలో చూస్తామని ఆయన చెప్పారు.
శంకరరావు అరెస్టు అన్యాయమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, ఈ ముఖ్యమంత్రి కేవలం ఒక ఫ్యాక్షనల్ నాయకునిలాగా పని చేస్తున్నారని ఆయన చెప్పారు. శంకరరావును పోలీసులు అరెస్టు చేయడంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకోవడం, విడుదల చేసిన తీరు బాధాకరమని ఆయన అన్నారు. శంకరరావును అరెస్టు చేయడంపై మంత్రులు బాలరాజు, ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు.
శంకరరావును అరెస్టు చేయడాన్ని ఓ అమానుష చర్యగా డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తుల అహంకారానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. దళితులు ఈ చర్యను ఖండించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications